నటీనటులు : సాయి తేజ్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు.
దర్శకత్వం : మారుతి
సంగీత దర్శకుడు : ఎస్.తమన్
సినిమాటోగ్రఫీ : జయరాజ్ సంపత్
నిర్మాతలు : బన్నీ వాసు, వంశీ, ప్రమోద్
బ్యానర్ : గీతా ఆర్ట్స్ 2-యువీ క్రియెషన్స్
విడుదల తేది : 20 డిసెంబర్ 2019
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కేరీర్ ప్రారంభంలో ఉన్నంత జోరుగా లేని సమయంలో వచ్చిన సినిమా ప్రతిరోజు పండుగే. ఈసినిమాకు ముందు వచ్చిన చిత్ర లహారి సినిమా సాయిధరమ్ తేజ్‌ను నిలబెట్టింది. అందుకు ముందు వచ్చిన సినిమాలు వరుస పరాజయాల పొందాయి. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్ మొదలుకొని ట్రైలర్, సాంగ్స్ అన్నీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి.. మరి సినిమా కూడా అదే స్థాయిలో అలరించిందో లేదో ఓ లుక్కేద్దాం.
కథ: అమెరికా సెటిల్ అవుతుంది సాయిధరమ్ తేజ్ కుటుంబం. తన స్వగ్రామం మాత్రం రాజమండ్రి. తాత సత్యరాజ్ మాత్రం రాజమండ్రిలో ఉంటాడు. అమెరికా నుంచి హుటాహుటిన రాజమండ్రి వస్తాడు సాయి తేజ్. అమెరికాలో తండ్రి బిజినెస్ లు చూసుకుంటున్న సాయితేజ్ అంత అర్జెంట్ గా రాజమండ్రి రావడానికి కారణం అతని తాతయ్య కారణం. నలుగురు పిల్లలున్నా.. తన దగ్గర ఎవరు లేకపోవడం, తనను చూడడానికి కూడా పిల్లలకు ఖాళీ లేకపోవడంతో మానసికంగా కృంగిపోతాడు సత్యరాజ్. అలాంటి తరుణంలో తనకు లంగ్ క్యాన్సర్ అని తెలుస్తుంది. ఆఖరి రోజుల్లో తాతయ్యను ఆనందంగా ఉంచడమే మనవడు సాయితేజ్ టార్గెట్. ఆ టార్గెట్ లో భాగంగా టిక్ టాక్ స్టార్ ఏంజెల్ ఆర్నా (రాశిఖన్నా)ను ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో సాయితేజ్ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? చివరికి సాయితేజ్ తన తాతయ్యకు తన పిల్లలతో గడపాలన్న లోటును తీర్చాడా? ఇందులో మెలిక ఏమిటి? అనేది “ప్రతిరోజూ పండగే” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: సాయితేజ్ ఈ చిత్రంలో చాలా స్టైలిష్ గా, కొత్త లుక్ తో కనిపించాడు. కామెడీ సీన్స్ కంటే ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకుల్ని బాగా మెప్పించాడు. సత్యరాజ్-సాయితేజ్ ల నడుమ తాత-మనవడు కెమిస్ట్రీ భలే కుదిరింది. ఈ పాత్రలను బాగా పండించారు. ఆ ఏజ్ వాళ్ళందరూ ఈ పాత్రలకి బాగా కనెక్ట్ అవుతారు. తాను ఎలాంటి పాత్రలోనైనా జీవించగలను అని సత్యరాజ్ మరోసారి ప్రూవ్ చేసుకొన్నారు. అలాగే.. రావు రమేష్ తనలోని నటనను ప్రేక్షకులకు రుచి చూపించాడు. రావు రమేష్ లోని కామెడీ, ఎమోషనల్ యాంగిల్ ను దర్వకుడు మారుతి బాగా ఉపయోగించుకున్నారు. టిక్ టాక్ స్టార్ ఏంజెల్ ఆర్నాగా రాశిఖన్నా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ హీరోయిన్ గా ఆకట్టుకొంది. మునుపటి చిత్రాలతో పోల్చి చూస్తే.. గ్రామీణ యువతిగా లంగాఓణిలో రాశి మరింత అందంగా అలరించింది. ఎమోషన్స్ లోనూ తన సత్తా చాటుకొంది. ఆర్నా పాత్ర ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ పాత్రల్లో ఒకటిగా నిలుస్తుంది. హరితేజ కామెడీ ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది. సత్యం రాజేష్, అజయ్ ల పాత్రలను సరైన తీరులో వాడుకుంటే ఇంకా మంచిగా ఉండేది.
సాంకేతికవర్గం పనితీరు: తమన్ పాటలు, నేపధ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. చిన్నతనమే, ఓ బావా సాంగ్స్ కొన్నాళ్లపాటు గుర్తుండిపోతాయి. జయరాజ్ సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ గా ఉంది. కాకపోతే.. ఎమోషనల్ సీన్స్ ను కూడా మరీ బ్రైట్ గా చూపించడంతో.. సన్నివేశంలోని ఎమోషన్ తెరపై పండలేదు. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది.. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త నిక్కచ్చిగా ఉంటే బాగుండేది. దర్శకుడు మారుతి కథ కంటే కథనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు.. అతను మొదటి సినిమా నుంచి ఫాలో అవుతున్న ఫార్ములా ఇదే. అయితే.. భలే భలే మగాడివోయ్ సినిమా విషయంలో ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. ప్రతిరోజూ పండగేలో అది మిస్ అయ్యింది. ప్రతిరోజూ పండగే అనే టైటిల్ కి జన్స్టిఫికేషన్ ఇచ్చిన విధానం బాగుంది, ప్రతి నటుడి నుండి చక్కని నటన రాబట్టుకున్న విధానం కూడా బాగుంది. కానీ.. కామెడీతో ప్రేక్షకుల్ని అలరించిన మారుతి అదే ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా సినిమాలో ఇన్వాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. మారుతి పాత ఫార్మూలానే పట్టుకుని ముందుకు సాగాడు.. కాకుంటే రావు రమేష్ నటన, సత్యరాజ్, సాయిధరమ్ తేజ్‌ల ఇమేజ్ సినిమాను కాపాడుతుంది.
చివరిగా: సాయిధరమ్ తేజ్, సత్యరాజ్, రావు రమేష్‌ల పాత్రలతో సినిమాకు భారీ హైప్ వచ్చింది. సినిమాలో రాశీఖన్నా కూడా తన పరిధి మేరకు రాణించి సినిమాకు ప్లస్‌గా మారింది. ఇక సినిమాలో కామెడీ ఎంజాయ్ చేయవచ్చు. ప్రకృతిని ఆస్వాదించే వారికి మాత్రం ఈ సినిమా బాగా నచ్చుతుంది. సినిమాలో ఎమోషనల్, కామెడీ, రోమాన్స్ అన్ని సమపాళ్ళలో ఉన్నాయి. ఇక సాయిధరమ్ తేజ్‌కు ఇతర సినిమాల నుంచి వచ్చే పోటీని బట్టి ఈ సినిమా హిట్టా ఫట్టా అని తేలిపోతుంది.
రేటింగ్: 2.5/5