ష‌ర్మిలకు రేవంత్ కండీష‌న్‌… పాలేరు టిక్కెట్ నో… కావాలంటే ఆ సీటు తీసుకో..!

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచిన వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ ష‌ర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటంపై చర్చ సాగుతూనే ఉంది. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే విషయంపై ఒక అవగాహనకు వచ్చారని.. అయితే అక్కడ వారి మధ్య కొన్ని షరతులే అడ్డంగా మారాయని ఓ ప్రచారం జరుగుతుంది. అందులో మొదటిది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి గ‌త వైభవం తీసుకురావాలని షర్మిల‌కు కాంగ్రెస్ అధిష్టానం కోరుతుందట. అందుకు ఆమె స‌సేమిరా అంటున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

అదేవిధంగా గత కొన్ని రోజులగా తెలంగాణలో తన పార్టీ కార్యక్రమాలకు కూడా షర్మిల దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో తన పార్టీ విలీనం గురించి ఏదో ఒకటి తేల్చుకున్న తర్వాతే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ షర్మిలకు మరో ప్రతిపాదన కూడా పెట్టిందట.. విశ్వ‌సనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం షర్మిల ముందు నుంచి పాలేరులో పోటీ చేయించ‌డంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం వ్యతిరేకిస్తున్నాడట.

అంతేకాకుండా షర్మిలను సికింద్రాబాద్ లోక్‌స‌భ బరిలో పోటీ చేయించాలని ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మేరకు ఆమెతో చర్చలు కూడా జరుపుతున్నారట‌. సికింద్రాబాద్ నుంచి షర్మిలను పోటీకి దింపటం వెనుక కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సికింద్రాబాద్ లోక్‌స‌భ పరిధిలో క్రిస్టియన్ ఓట్లు ఎంతో కీలకంగా ఉన్నాయి.

ఆ నియోజకవర్గం నుంచి షర్మిల పోటి చేస్తే సులువుగా గెలవడంతో పాటు సెటిలర్స్, వైఎస్సార్ అభిమానులు, త‌న సామాజిక వర్గ ఓటర్లపై కూడా ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ అన్ని అనుకున్నట్టు జరిగితే షర్మిల కాంగ్రెస్ లో చేరితే సికింద్రాబాద్ నుంచి పోటీ తధ్య‌మని చెప్పవచ్చు.