ఈసారి తెలంగాణ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఇప్పటికే వరుసుగా రెండుసార్లు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముచ్చటగా మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామన్న ధీమా పార్టీ నుంచి వ్యక్తం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ టిఆర్ఎస్‌ను ఈసారి గద్దె దించి తాము అధికారంలోకి రావాలని కాంగ్రెస్ – బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణలో ఆ పార్టీకి దక్కేది మూడో స్థానమే అన్నది స్పష్టంగా కనబడుతున్న క్లియర్ పిక్చర్.
2014 – 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి టిఆర్ఎస్కు మరీ అంత వన్ సైడ్ గా అయితే లేదు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూల కనిపిస్తున్న మాట వాస్తవం. ఇది ఆ పార్టీని అధికారంలోకి ఎంతవరకు తెస్తుందో చూడాలి. కాంగ్రెస్ నేతల మధ్య కుమ్ములాటలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఈజీగా ఉన్నాయి. ఇది ఎలా ఉంటే ప్రస్తుతం టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తాను మరోసారి కొడంగల్ నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు చెప్పారు.
2009 – 2014 ఎన్నికలలో రేవంత్ రెడ్డి టిడిపి తరఫున కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరారు. 2018లో టిఆర్ఎస్ పట్టుబట్టి రేవంత్ ని ఓడించింది. మాజీ మంత్రి.. ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి రేవంత్ పై గెలిచారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన రేవంత్ అనూహ్యంగా నాలుగు నెలల లోనే 2019 పార్లమెంటు ఎన్నికలలో మల్కాజ్గిరి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.
ఆ తర్వాత కాంగ్రెస్లో తన పట్టు పెంచుకొని తెలంగాణ. రాష్ట్ర కాంగ్రెస్‌కు సారథ్యం వహించే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు రేవంత్ సీఎం రేసులో కూడా ఉన్నారు. కొడంగల్ స్థానానికి రేవంత్ దరఖాస్తు చేసుకోవడంతో ఆయన ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తారు అంటూ జరిగిన ప్రచారం అవాస్తవం అని తేలిపోయింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ గజ్వేల్ లో కేసీఆర్ ఓడిపోతానని భయంతోనే గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.