ఏలూరు టీడీపీ ఎంపీ టిక్కెట్ రేసులో ‘ గోరుముచ్చు ‘ … బీసీ ఈక్వేష‌న్‌లో రేసులోకి…!

ఏలూరు లోక్‌స‌భ సీటుపై ఈసారి తెలుగుదేశం పార్టీ సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యే సమాలోచనలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి చాలాసార్లు ఈ లోక్‌స‌భ సీటు ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. కాంగ్రెస్ నుంచి దివంగత సూపర్ స్టార్ కృష్ణ పోటీ చేసినప్పుడు కూడా ఆయనని ఓడించిన ఘనత తెలుగుదేశం పార్టీది అంటే ఏలూరు లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో తెలుస్తోంది.

గతంలో ఇక్కడ నుంచి కేంద్ర మాజీ మంత్రి బోళ్ల‌ బుల్లి రామయ్య.. ఆ తర్వాత మరో మాజీ మంత్రి మాగంటి బాబు టిడిపి తరఫున ఎంపీలుగా గెలిచారు. కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వచ్చిన మాగంటి బాబు 2009 – 2019 ఎన్నికలలో ఓడి 2014 ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. అయితే వయోఃభారంతో పాటు ఆర్థిక కారణాలు, సామాజిక ఈక్వేషన్ల నేపథ్యంలో ఈసారి మరోసారి బాబుకు ఎంపీ టికెట్ వస్తుందా ? రాదా అన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీంతో కొన్ని కొత్త పేర్లు కూడా తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

1952లో ఏలూరు లోక్సభ నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచి 2019 ఎన్నికల వరకు ( మధ్యలో ఒకసారి మినహాయిస్తే ) ఏ పార్టీ నుంచి అయినా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఎంపీలుగా గెలుస్తూ వచ్చారు. 2019లో మాత్రం వైసిపి నుంచి పోటీచేసిన వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత ఎంపీ కోటగిరి శ్రీధర్ ఘనవిజయం సాధించారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం తరఫున ఎంపీ అభ్యర్థులుగా వినిపిస్తున్న పేర్లలో మాగంటి బాబుతో పాటు చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి – చింతమనేని ప్రభాకర్ తదితరుల పేర్లతో పాటు బీసీ వర్గానికి చెందిన గోరుముచ్చు గోపాలరావు పేరు కూడా వినిపిస్తోంది. ఆయన స్వస్థలం చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని కామవరపుకోట మండలం కంఠ‌మనేని వారిగూడెం.

గ్రూప్ ఆఫ్ ఏషియన్ టెక్నాలజీగా ఉన్న గోపాలరావు గత నాలుగు నెలలుగా ఏలూరు లోక్సభ పరిధిలో విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నారు. ఆయన బీసీల్లో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబును రెండు మూడుసార్లు కలిసి ఎంపీగా పోటీ చేయాలన్న తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. తాను ఎంపీగా బ‌రిలోకి దిగితే ఎంత ఖ‌ర్చు చేస్తాన‌న్న దానిపై చంద్ర‌బాబు వ‌ద్ద ఓ ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫిగ‌ర్ కూడా బ‌య‌ట పెట్టిన‌ట్టుగా తెలిసింది. తాజాగా యువ‌గళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ను సైతం ఆయన కలిసి వచ్చారు. ఏలూరు లోక్‌స‌భ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాద‌వ వ‌ర్గం ఓట్లు బలంగా ఉన్నాయి.

గత లోక్‌స‌భ ఎన్నికలలో వైసిపి రాజమండ్రి పార్లమెంటు సీటులో బీసీ ప్రయోగం చేసి సక్సెస్ అయింది. ఈసారి టిడిపి ఏలూరు నుంచి బీసీ ప్రయోగం చేయాలనుకుంటే కచ్చితంగా గోపాలరావు టిడిపి ఎంపీ అభ్యర్థిగా బలంగా రేసులో ఉండనున్నారు. అదే స‌మ‌యంలో బీసీ అస్త్రంతో అటు అధికార వైసీపీని డిఫెన్స్ లో పెట్టినట్టు కూడా ఉంటుందని టిడిపి అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. 2009 ఎన్నిక‌ల్లో నాడు చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి ఇదే యాద‌వ సామాజిక వ‌ర్గం నుంచి నాన్ లోక‌ల్ అయిన రెడ్డ‌య్య యాద‌వ్ పోటీ చేస్తేనే 2.60 ల‌క్ష‌ల ఓట్లు ప‌డ్డాయి. నాడు

ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న స‌రిగా ప్ర‌చారం కూడా చేయ‌లేదు. అయినా ఆ స్థాయిలో ఓడింగ్ ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం క్యాస్ట్ ఈక్వేష‌న్ అన్న‌ది వేరే చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సారి గోపాల‌రావు పోటీ చేస్తే బీసీల్లో గ‌ణనీయమైన మార్పుతో పాటు ఆ ఓటింగ్.. టీడీపీ సంప్ర‌దాయ ఓటింగ్‌లో మార్పులు వ‌స్తాయ‌నే అంచ‌నాలు టీడీపీకి ఉన్నాయి. అదే స‌మ‌యంలో టీడీపీ నెల్లూరు లోక్‌స‌భ నుంచి కూడా యాద‌వ వ‌ర్గానికి చెందిన ఓ నేత పేరు ప‌రిశీలిస్తోంది. ఈ స‌మీక‌ర‌ణ‌లు ఎన్నిక‌ల వేళ చివ‌ర్లో ఎలా ? మార‌తాయో ? చూడాలి.