ఈసారి మంగళగిరిలో లోకేష్ గెలుపును ఎవరు ఆపలేరు.. గెలుపు మాత్రమే కాదు భారీ మెజార్టీతో లోకేష్ విజయం పక్కా అన్న నివేదికలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు ఇప్పటికే వెళ్లిపోయాయి. గత ఎన్నికలలో లోకేష్ మంగళగిరిలో రిస్క్ చేసి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి లోకేష్ మాత్రం నియోజకవర్గాన్ని వదల్లేదు. నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుంటూ వస్తున్నారు. కరోనా సమయంలోను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.
ఇటీవల నిర్వహించిన యువగళం పాదయాత్రలో మంగళగిరిలో జనాలు స్వచ్ఛందంగా పోటెత్తారు. ఇక రాజధాని మార్పు ప్రభావంతో పాటు మంగళగిరిలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యం కావడంతో తాడికొండ – మంగళగిరి నియోజకవర్గాల్లో ప్రజలలో పార్టీలు, వర్గాలు, కులాలతో సంబంధం లేకుండా భారీ మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాడికొండ – మంగళగిరి నియోజకవర్గాల్లో ఈసారి తెలుగుదేశం పక్కా విక్టరీ కొట్టబోతుందని వైసిపి వాళ్ళే ఒప్పుకుంటున్నారు.
రాజధాని మార్పు ప్రభావంతో నియోజకవర్గ ప్రజల జీవన విధానం అస్తవ్యస్తం అయింది. జీవన ప్రమాణాలు బాగా పడిపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రజల ఆర్థికంగా ఒక వెలుగు వెలిగారు. పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టారు. ఎప్పుడు అయితే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి వారి జీవన విధానం పూర్తిగా తలకిందులు అయింది. ఈ క్రమంలోనే వైసిపి అంతర్గత సర్వేలతోపాటు ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ సర్వేలలోనూ ఈసారి ఇక్కడ వైసిపి చిత్తు చిత్తుగా ఓడిపోతుందని తేటతెల్లమయింది.
గత ఎన్నికల్లో ఓడిపోయాక లోకేష్ ఈసారి మంగళగిరి నుంచి పోటీ చేయరు అంటూ వైసీపీ వర్గాలు గట్టిగా ప్రచారం చేశాయి. అయితే లోకేష్ వచ్చే ఎన్నికల్లోను తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే ఈసారి ఇక్కడ వైసిపికి తీవ్ర వ్యతిరేకంగా నివేదికలు రావడంతో జగన్ కొత్త స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ రెండుసార్లు గెలిచిన వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పై నియోజకవర్గంలో సొంత పార్టీ కేడర్ లోనే వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయాన్ని అధిష్టానం గుర్తించింది కూడా..!
రెడ్డి వర్గం కూడా ఆళ్ళ మీద అసంతృప్తితో ఉన్నారు. వరుసగా మంగళగిరి ప్రజలు ఆయన్ను రెండు సార్లు గెలిపిస్తే… ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధి కూడా ప్రత్యేకంగా ఏమీ లేదు. దీంతో ఈసారి వాళ్లను తప్పించి ఆ ప్లేస్ లో టిడిపి నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవితో పాటు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల – ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు పేర్లు రేసులో ఉన్నాయి. ఈ ముగ్గురు కూడా బీసీ వర్గానికి చెందిన వారే కావటం విశేషం. హనుమంతరావును పక్కన పెట్టిన చిరంజీవి లేదా కమలలో ఎవరో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందని తెలుస్తోంది.
ఈసారి జగన్ లోకేష్ పై బీసీ అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తున్నట్టు సమాచారం. మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అందుకే ఆ వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇస్తే లోకేష్ కు ఈసారి గట్టి పోటీ ఉంటుందని.. లేకపోతే ఈసారి మంగళగిరిలో కచ్చితంగా తమకు ఘోర పరాభవం తప్పదన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు టిడిపి కూడా చేనేత వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధకు మంగళగిరిలో చేనేత వర్గాన్ని ఏకం చేసే బాధ్యతలు అప్పగించింది. ఇక ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బాపట్ల లేదా సత్తెనపల్లి బరిలో ఉంటారని వినిపిస్తోంది.