మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక దిగ్గజం శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్లో నిర్మాతల సంఘం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రస్తుతం తెలుగులో షూటింగులు జరగడం లేదు. దీంతో ఆర్సీ15 సినిమా షూట్ కి బ్రేక్ పడింది. కొద్ది రోజులుగా హైదరాబాద్లోనే ఉంటూ బిజీ బిజీగా ఉన్న శంకర్ ప్రస్తుతం మళ్లీ చెన్నైకి మకాం మార్చారు. అయితే రామ్ చరణ్ తో సినిమా కంటే ముందుగానే శంకర్ కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 అనే సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. షూటింగ్ స్పాట్ లో జరిగిన ప్రమాదంతో ఈ సినిమా షూటింగ్ రెండేళ్ల కిందట ఆగిపోయింది. ఆ తర్వాత ఈ సినిమా నిర్మాతలతో శంకర్ కు విభేదాలు రావడంతో ఈ మూవీ నుంచి శంకర్ పక్కకు తప్పుకున్నారు. అయితే దీనిపై లైకా ప్రొడక్షన్స్ కోర్టుకు పోవడంతో ఇండియన్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేయాలని శంకర్ కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అయితే ఆలోగానే శంకర్ రామ్ చరణ్ తో సినిమా ప్రారంభించారు. ఇది పూర్తయిన తర్వాత ఇండియన్ 2 సినిమా ప్రారంభం అవుతుందని అంతా భావించారు. అయితే అనుకోకుండా రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాకు బ్రేక్ పడటంతో ఇండియన్ 2 సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించాలని శంకర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 24వ తేదీ నుంచి ఒక షెడ్యూలు కూడా ప్రారంభించాలని శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ షెడ్యూల్ ను ప్రధాన ఆర్టిస్టులు పాల్గొన కుండానే చేయాలని షూట్ చేయాలని శంకర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు దొరికిన గ్యాప్ లో ఇండియన్2 ఒక చిన్న షెడ్యూల్ పూర్తి చేసి మళ్లీ ఆర్సీ15 సెట్స్ కు రావాలని శంకర్ భావిస్తున్నట్లు సమాచారం.