కోలీవుడ్ అగ్రహీరో అజిత్ – శిరుతై శివ కాంబినేషన్ లో నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా విశ్వాసం. 2019 లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో కూడా డబ్బింగ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తండ్రి, కూతురు సెంటిమెంట్ తో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో అజిత్ కూతురిగా బేబీ అనికా తన నటనతో మెప్పించింది.
ఈ సినిమా తర్వాత కొన్ని తమిళ, మలయాళ సినిమాల్లో అనికా నటించింది. రెండు భాషల్లో చక్కటి గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు పలు అవార్డులను కూడా కైవసం చేసుకుంది. ఇప్పుడు ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధం అవుతోంది.
ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళనాడులో గుర్తింపు తెచ్చుకున్న అనికా ఓ తమిళ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కానుంది. డైరెక్టర్ ఆల్బర్ట్ సాము వేల్ ప్రస్తుతం ఓ మై డార్లింగ్ అనే పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా అనికా ఎంపిక అయింది. అయితే ఇందులో నటించే హీరో, ఇతర నటుల వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి. బాలనటిగా ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకున్న అనికా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఎలా రాణిస్తుందో చూడాలి.