ప్రస్తుత నరసాపురం వైసిపి ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నది గత రెండేళ్లుగా ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే. రఘురామ కృష్ణంరాజు ఇప్పటికీ తాను వైసీపీలోనే ఉన్నానని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఆయనపై చర్యలు తీసుకునే విషయంలో వైసిపి అధిష్టానం వెనుక ముందు ఆలోచిస్తూ వస్తోంది. రఘురామ మాత్రం వైసిపి అధినేతతో పాటు ఆ పార్టీ నేతలను ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు.
ప్రతిరోజు మీడియా సమావేశం పెట్టి వాయించేస్తూ ఉంటారు. రఘురామ వచ్చే ఎన్నికలలో వైసీపీ నుంచి ఎలాగూ పోటీ చేయరు. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నదానిపై చాలా చర్చలే నడిచాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన జనసేనలోకి వెళ్లి ఆ పార్టీ తరఫున నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన తన సిట్టింగ్ సీటు నుంచే మరోసారి పోటీ చేస్తారన్న టాక్ వచ్చింది. అయితే ఈసారి పార్టీ మారి జనసేన కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అలాగే ఆయన బిజెపికి కూడా దగ్గరగానే ఉంటూ వస్తున్నారు. అయితే పొత్తుల్లో భాగంగా నరసాపురం సీటు ఎలాగూ బిజెపికి ఇచ్చే ఛాన్సులు లేవు. ఈ క్రమంలోనే జనసేన బలంగా ఉన్న నరసాపురం నుంచి ఆయన జనసేన తరపున పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
అలాగే రాజమహేంద్రవరం ఎంపీ సీటు విషయంలో కూడా రఘురామ పేరు ప్రస్తావనకు రావడం విశేషం. ఏది ఏమైనా రఘురామ వచ్చే ఎన్నికలలో మరోసారి లోక్సభకు పోటీ చేయటం ఖాయం. అయితే ఆ పోటీ ఏ పార్టీ నుంచి ఏ స్థానం నుంచి ఉంటుంది అన్నదే చివరి వరకు కాస్త సస్పెన్స్ గా ఉండొచ్చు.