వరుణ్‌తో ‘తొలిప్రేమ’ అనేసి.. రవితేజతో ‘టచ్ చేసి చూడ’మని.. ప్రేక్షకుల ‘ఊహలు గుసగుసలాడే’లా చేసిన హాట్ బ్యూటీ రాశీ ఖన్నా. ఇక తాజాగా సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలిరోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. చిత్రలహరి సినిమాతో విజయాల బాట పట్టారు సాయితేజ్. ఈ సక్సెస్ తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తలు వహిస్తూ తన పంథాకు భిన్నంగా అతడు చేసిన ప్రతిరోజూ పండగే చిత్రంపై టాక్ బాగానే వచ్చింది.
ఇక సినిమా సక్సెస్ మీట్‌లో హీరో ధరమ్ తేజ్, హీరోయిన్ రాశి ఖన్నాలతో పాటు దర్శకుడు మారుతీ మరియు నిర్మాత బన్నీ వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాశి ఖన్నా ప్రతిరోజూ పండుగే లాంటి ఒక మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిరోజూ పండుగే చిత్రంలో తాను చేసిన ఏంజెల్ ఆర్నా పాత్రకు చాలా పేరు వచ్చిందన్న రాశి.. తనను అందరూ ఏంజెల్ ఆర్నా అని పిలుస్తున్నారని చెప్పుకొచ్చింది.
పల్లెటూరికి చెందిన అమ్మాయిగా రాశి ఖన్నా ఈ చిత్రంలో అద్భుతంగా నటించింది. కాగా, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో టిక్ టాక్ సెలెబ్రిటీగా రాశి ఖన్నా బాగా మెప్పించింది. అలాగే తాతను ప్రేమించే మనవడి పాత్రలో సాయిధరమ్ తేజ్ అదరగొట్టాడు. అయితే, రావు రమేష్, సత్యరాజ్ పాత్రలు స్ట్రాంగ్ పాయింట్ చుట్టూనే ఉండటంతో సాయి పాత్ర కంటే ఈ రెండు పాత్రలు హైలైట్ అయ్యాయి.