అప్పట్లో ఎన్టీఆర్‌ని కలిసిన క్వీన్ ఎలిజబెత్.. ఇదిగో ఆ ఫొటో!

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్-2 మరణించిన సంగతి తెలిసిందే.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. రాణి ఎలిజిబెత్-2కి ఇండియా అంటే ప్రత్యేక అభిమానం.. 1952లో బ్రిటన్ రాణిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు.. ఆమె భారత సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసుకొనేందుకు ఆసక్తి చూపించేవారు.. రాణి ఎలిజిబెత్-2 భారత్ లో మూడుసార్లు పర్యటించారు. 1961, 1983, 1997లలో భారత సందర్శనకు వచ్చారు.

రాణి ఎలిజిబెత్-2కు హైదరాబాద్ తోనూ ఆత్మీయ సంబంధం ఉంది. కామన్ వెల్త్ దేశాధినేతల భేటీలో పాల్గొనేందుకు ఆమె 1983లో భారత్ కు వచ్చారు. అప్పుడు ఆమె హైదరాబాద్ లోనూ పర్యటించారు. ఆ ఏడాది నవంబర్ 20న హైదరాబాద్ కు వచ్చిన క్వీన్ ఎలిజిబెత్ దంపతులకు అప్పటి సమైక్య రాష్ట్ర గవర్నర్ రామ్ లాల్, ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్వాగతం పలికారు.

పర్యటనలో భాగంగా నాలుగు రోజులు ఆమె నగరంలో ఉన్నారు. నగరంలోని బీహెచ్ఈఎల్, ఇక్రిశాట్, కుతుబ్ షాహి సమాధులను సందర్శించారు. ఇక సికింద్రాబాద్, బొల్లారంలోని హోలీట్రినిటీ చర్చిలో క్వీన్ ఎలిజిబెత్, ప్రిన్స్ ఫిలిప్ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ చర్చిని 1847లో క్వీన్ విక్టోరియా ఇచ్చిన నిధులతో నిర్మించారు. క్వీన్ ఎలిజిబెత్-2 క్వీన్ విక్టోరియా ముని మనవరాలు.. దీంతో బిషప్ లు ఆమె ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు క్వీన్ ఎలిజిబెత్ హోలీట్రినిటీ చర్చికి వెళ్లారు.

అరుదైన కానుక ఇచ్చిన నిజాం రాజు..

క్వీన్ ఎలిజిబెత్ -2కు నిజాం రాజు అరుదైన కానుక అందజేశారు. ఆమె పెళ్లి 1947లో జరిగింది. ఈ సందర్భంగా అప్పటి నిజాం ప్రభువైన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆమెకు వజ్రాల హారాన్ని కానుకగా ఇచ్చారు. 300 వజ్రాలు పొదిగిన ఓ ప్లాటినం నెక్లెస్ ని ఆమెకు బహుమతిగా అందజేశారు. ఆ వజ్రాల హారాన్ని రాణి ఎలిజిబెత్ పలు సందర్భాల్లో ధరించారు.

Tags: dead, movies, ntr, photos, queen elizabeth, viral