ఆ రేంజ్‌లో మర్యాదలు చేసే కృష్ణంరాజు.. అందుకు కారణం ఏంటంటే..!

ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు(83) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతి సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయనకు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు. ప్రముఖ నటుడు ప్రభాస్ ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడు. కృష్ణంరాజు అంత్యక్రియలు హైదరాబాద్ లో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో కృష్ణంరాజు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రెబల్ స్టార్. కృష్ణంరాజు చిలకా గోరింకా చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు. ఆ సినిమా పరాజయం పాలైంది. దీంతో ఆయన్ను ఐరన్ లెగ్ అనుకున్నారు. అయితే ‘అవేకళ్లు’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత ‘కృష్ణవేణి’, భక్త కన్నప్ప, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, పల్నాటి పౌరుషం లాంటి హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా మారారు. తనదైన ఆహార్యంతో నటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు.

1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆయన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే.. వారికి మర్యాదలతో ముంచెత్తుతారు. ఇక కృష్ణంరాజు మర్యాదల వెనుక ఓ కథ కూడా ఉందట.. ఆయన చిన్నతనంలో ఒకరోజు ఓ పెద్దాయన ఇంటికి వచ్చాడట.. ఆ పెద్దాయన ముందు కృష్ణంరాజు కాళ్లు జాపుకుని తాపీగా కూర్చున్నారట.. ఆయన వెళ్లేంత వరకు అలాగే కూర్చున్నారట.. దీంతో కృష్ణంరాజు తండ్రి కొరడా తెప్పించి చితకొట్టారట.. ఇంటికి ఎవరు వచ్చినా అతిథి మర్యాదలు చేయాలని, ఏ పనిలో ఉన్నా వారిని గౌరవించాలని తండ్రి చెప్పారట.. అప్పటి నుంచి కృష్ణంరాజు ఇంటికి వచ్చిన వారికి మర్యాదలు చేస్తుంటారట.. రెబల్ స్టార్ ప్రభాస్ కి కూడా ఇదే అలవాటు ఉంది.

Tags: Krishnam Raju, latest news, maryada, viral