ఎటు చూసినా జనం.. ఎటు విన్నా చంద్రన్న నామస్మరణం.. ఎవరూ ఊహించలేదు. ఎవరూ అనుకోలేదు. ఆ.. ఏముందిలే.. ఓ వెయ్యో.. రెండువేలమందో వస్తారులే! అనుకున్నారు. అందరూ లైట్ తీసుకున్నారు. కానీ, ఎవరూ ఊహించను కూడా ఊహించని విధంగా ప్రజలు పోటెత్తారు. పులివెందలలో కేక పుట్టించారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… సీమ డిక్లరేషన్ పేరుతో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గతంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రస్తుతముఖ్యమంత్రి జగన్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే ఆయన నాలుగు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. కర్నూలులో తొలి రోజు సభకు అనుకున్న విధంగానే జనాలు వచ్చారు. ఇక… రెండో రోజైన బుధవారం.. మాత్రం పులివెందులలో చంద్రబాబు పర్యటిస్తున్నారని తెలిసి.. తమ్ముళ్లు ఒకింత.. ఉత్కంఠకు గురయ్యారు. ఎవరు వస్తారో.. ఎవరు రారో.. వస్తామని చెప్పిన వారు కూడా చివరి నిముషం హ్యాండిస్తే.. ఏమవుతుందో అని హడిలి పోయారు.
అయితే.. బుధవారం రానే వచ్చింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా.. పులివెందుల సెంటర్‌లో బ్యానర్లు అయితే.. వేలాడుతున్నాయి. కానీ, ప్రజలు లేరు. ఎవరి మానాన వారు పనిచేసుకుంటున్నారు. మరోవైపు కార్లలో టీడీపీ నాయకులు చక్కర్లు కొడుతున్నారు. మైకుల్లో ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు వస్తున్నారనంటూ.. ప్రచారం చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలైంది. చంద్రబాబు పులివెందుల అడ్డాపై అడుగు పెట్టారు.
అంతే! ఎక్కడ నుంచి వచ్చారో.. ఎలా వచ్చారో కూడా తెలియదు.. పులివెందుల నిండిపోయింది. ఎంతగా అంటే.. చంద్రబాబు ప్రచార రథం కూడా.. నడవలేనంతగా ప్రజలు గుమిగూడారు. జేజేలు పలికారు. కేవలం అరకిలో మీటరు దూరాన్ని ప్రయాణించాలంటే.. రెండు గంటల సమయం పట్టింది. దీంతో పులివెందుల మొత్తం కదలి వచ్చిందా! అని నాయకులు సంతసించిపోయారు.