ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ నేతృత్వంలో మూడో కూట‌మి..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఒక‌వైపు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ను ఊడ్చిపారేసిన‌ ఆమాద్మీపై ప్రశంసలు కురుస్తున్నాయి. స‌రిగ్గా అదే స‌మ‌యంలో మ‌రో చ‌ర్చ‌కు తెర‌లేచింది. జాతీయ స్థాయిలో కాంగ్రేసేత‌ర‌, బీజేపీయేత‌ర కూట‌మి ఏర్పాటు కానుంద‌ని ఊహాగానాలు జోరందుకున్నాయి. అదీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ నేతృత్వంలోన‌ని వార్త‌లు విన‌వ‌స్తుండ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. జాతీయ రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తున్న‌ది. రాబోయే కొద్ది రోజుల్లోనే దేశ రాజ‌కీయాల్లో పెను మార్పులు త‌థ్య‌మ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు జోస్యం చెబుతుండ‌డం అందుకు ఊత‌మిస్తున్నాయి. మ‌రి ఇంత‌కు థ‌ర్డ్ ఫ్రంట్ ఆవ‌శ్య‌క‌త ఉన్న‌దా? అందుకు ప‌రిస్థితులు అనుకూలిస్తాయా? ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు ఎలా సాగుతున్నాయి? అందులో ఎవ‌రు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు? ఎవ‌రు నేతృత్వం వ‌హించ‌నున్నారు? అన్న అంశాలు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. వాటిని ఒక‌సారి మ‌న‌మూ ప‌రిశీలిద్దాం.

ఎన్నో ఆశ‌ల‌ను రేపుతూ.. సామాన్యులకు భ్ర‌మ‌ల‌ను క‌ల్పిస్తూ అధికారంలోకి వ‌చ్చింది బీజేపీ. ఇప్ప‌టికీ చేసిందేమీ లేదు. అదీగాక కాకుల‌ను కొడుతూ గ‌ద్ద‌ల‌కు వేస్తున్న చందంగా మారింది ఆ పార్టీ వ్య‌వ‌హారం. సంప‌న్నుల‌ను దోచిపెడుతూ.. సామాన్యుల‌ను విస్మ‌రిస్తూ వ‌స్తున్న‌ది. ఫ‌లితంగా గ‌త ఆరేళ్ల‌లోనే కార్పొరేట్ శ‌క్తులు గ‌త న‌ల‌భై ఏళ్ల‌లో లేనంత‌గా ల‌బ్ధి పొందాయ‌ని అధికారి నివేదిక‌లే తేటతెల్లం చేస్తున్నాయి. మ‌రోవైపు బీజేపీ ఒక్కో ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ను నిర్వీర్యం చేస్తూ వ‌స్తున్న‌ది. తాజాగా ఆ జాబితాలోకి ఎల్ ఐసీని సైతం చేర్చింది. ఇదిలా ఉండ‌గా క‌మ‌లం పార్టీ ఇప్పుడు ఏకంగా రాజ్యాంగ మౌలిక సూత్రాల‌నే తుంగ‌లో తొక్కే చ‌ర్చ‌ల‌కు దిగింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల ఆలోచ‌న‌. సీఏఏ, ఎన్ ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌తో తీర‌ని అశాంతిని రేపుతున్న‌దనేది మ‌రో వాద‌న‌. ఇక ఆ కాషాయ ద‌ళాన్ని ఢీకొట్టే స్థాయిలో కాంగ్రెస్ లేక‌పోవ‌డం, ఆ పార్టీపై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం స‌న్న‌గిల్ల‌డంతో జాతీయ రాజ‌కీయాల్లో శూన్య‌త నెల‌కొంద‌న్న‌ది వాస్త‌వం. స‌రిగ్గా ఇదే త‌రుణాన్ని వినియోగించుకోవాల‌ని ప‌లు ప్రాంతీయ పార్టీలు యోచిస్తున్నాయి. మూడో కూట‌మికి పాదులు తీస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

ఇక ప్ర‌స్తుతం ఏర్పాట‌య్యే మూడో కూట‌మిలో ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజా ప‌రిణామాలు సైతం వాటినే సూచిస్తున్నాయి. అస‌లు విష‌య‌మేమిటంటే బీజేపీతోను, మ‌రీ ముఖ్యంగా ప్ర‌స్తుత కేంద్ర హోం మినిష్ట‌ర్ అమిత్‌షాతో జాతీయ రాజ‌కీయాల్లో తెర‌పైకి వ‌చ్చాడు పీకే. తొలిసారి బీజేపీ అఖండ విజ‌యం సాధించ‌డంలో కీల‌క పాత్ర‌ను పోషించారు. త‌ద‌నంత‌రం సొంతంగా ఒక ఎన్నిక స‌ల‌హాదారు సంస్థ‌ను ఏర్పాటు చేసుకుని ప్రాంతీయ పార్టీల‌కు ఎన్నిక‌ల‌కు సంబంధించి రాజ‌కీయ వ్యూహాల‌ను ర‌చిస్తూ, స‌ల‌హాలు సూచ‌న‌ల‌ను ఇస్తూ వాటి విజ‌యంలో కీల‌క‌భూమిక పోషిస్తున్నారు. గ‌తంలో ఏపీ సీఎం జ‌గ‌న్ కోసం ప‌నిచేశారు. తాజాగా ఢిల్లీ ఎన్నిక‌ల్లోనూ చ‌క్రం తిప్పారు. ఏఏపీకి ఎన్నిక వ్యూహాల‌ను ర‌చించి విజ‌యం సాధించారు. అదీగాక ప్ర‌స్తుతం అటు ప‌శ్చిమ‌బంగా సీఎం మ‌మ‌తాబెన‌ర్జీకి, త‌మిళ‌నాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీకి రాజ‌కీయ వ్యూహాల‌ను ర‌చించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. అదేవిధంగా మిగ‌తా ప్రాంతీయ పార్టీల‌తో స‌త్సంబంధాల‌ను నెర‌పుతున్నారు. ఈ క్ర‌మంలోనే వాటితో క‌లిపి మూడో కూట‌మిని ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. పీకే వ్యూహాల‌ను ప‌సిగ‌ట్టినందు వ‌ల్లే బీహార్ సీఎం నితీష్‌కుమార్ ఆయ‌న‌ను పార్టీని నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్లు స‌మాచారం. బ‌య‌ట‌కు మాత్రం సీఏఏపై వ్యాఖ్య‌ల‌ను కార‌ణాలు చూపినా అస‌లు రీజ‌న్ అదేన‌ని వినికిడి. సీఏఏనే ప్ర‌ధాన అస్ర్తంగా చేసుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని పీకే వ్యూహం ర‌చిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

ఇప్ప‌టికే గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ నేష‌న‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు కాస్తా బెడిసికొట్ట‌డంతో ఆలోచ‌న‌లో ప‌డ్డారు. వాటికి పుల్ స్టాప్ పెట్టిన‌ట్లు క‌నిపించారు. తాజాగా ఇటీవ‌లే తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల అనంత‌రం మ‌రోసారి మూడో కూట‌మి మాట‌ను ఎత్తారు. త్వ‌ర‌లోనే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తామ‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. అదీ సీఏఏకు వ్య‌తిరేకంగా స‌భ‌ను నిర్వ‌హిస్తామ‌న‌డం పీకే వ్యూహాన్ని ప్ర‌తిబింబిస్తున్న‌ది. కేసీఆర్ ప్ర‌క‌ట‌న త‌రువాత వెను వెంట‌నే ఏపీ సీఎం జ‌గ‌న్ సైతం కేంద్ర స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఏఏపై నోరు మెదిపారు. మ‌మ‌తా బెన‌ర్జీ సైతం అందులో ఉన్నారు. వారంతా ఒక జ‌ట్టు క‌ట్ట‌నున్నార‌ని స‌మాచారం. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీ విజ‌యాన్ని సాధించిన అనంత‌రం ప్రశాంత్‌ కిశోర్ చేసిన ట్విట్ సైతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భారత దేశ ఆత్మను కాపాడేందుకు అండగా నిలబడిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు అంటూ ఆయ‌న ట్విట్ చేయ‌డం వెనుక భారీ ఉద్దేశ‌మే ఉన్న‌ద‌ని బోధ‌ప‌డుతున్న‌ది. మూడో కూట‌మి ఏర్పాటును సూచిస్తున్న‌ది. మ‌రి అది నిజ‌మ‌వుతుందో? మ‌రోసారి తుస్సు మంటుందో చూడాలి.

Tags: cm kcr, dmk cheaf stalin, mamatha benerji, prashanth kishor, third front