గుడికి వెళ్తున్న మహిళలను అడ్డుకోవడమేంటని ఏపీ ప్రభుత్వం, పోలీసు అధికారులపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ లో మానవహక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల రైతులు, మహిళలు విజయవాడ దుర్గమ్మ ఆలయానికి వెళ్లడానికి శుక్రవారం పాదయాత్రగా తరలివచ్చారు. వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జి చేసి రైతులు, మహిళలను చెదరగొట్టారు. కొందరిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ లాఠీచార్జిలో పలువురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి.
ఈ సంఘటపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మహిళలనీ చూడకుండా లాఠీచార్జి చేస్తారా అని నిప్పులు చెరుగుతూ ట్విట్టర్‌లో పోస్టును పెట్టారు. గుడికి వచ్చిన మహిళలను అడ్గుకోవడం ఏంటి? వాళ్ల గ్రామ దేవతలను కూడా పూజించుకోనివ్వారా? అందుకు పోలీసుల అనుమతి తీసుకోవాలా? మహిళలు గుడికి కాకుండా మీలాగా కోర్టుల చుట్టూ తిరగమంటారా? అంటూ ఘాటు స్పందించారు బాబు. పాదయాత్రలో అక్కాచెల్లీ అంటూ అందరినీ పలకరించిన జగన్ ఇప్పుడు అదే అక్కాచెల్లెళ్లలో కన్నీటిని తెప్పిస్తున్నారని విమర్శించారు. పోలీసుల అండతో రైతులను అణచివేస్తున్నారని దుయ్యాబట్టారు. ఎన్నిచేసినా వైసిపీ ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని బాబుగారు తెలిపారు. దీనిపై బాబు తనయుడు నారా లోకేష్ సైతం ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ సంఘటనను ఖండించారు.