వెండితెర‌పైన మ‌రో బ‌యోపిక్‌.. త్వ‌రలోనే చ‌త్ర‌ప‌తి శివాజీ జీవితం..

టాలివుడ్‌, బాలివుడ్ సినీ ప్ర‌పంచంతో ప్ర‌స్తుతం బ‌యోపిక్‌ల హావా కొన‌సాగుతున్న‌ది. మ‌హ‌నీయుల జీవిత చ‌రిత్ర‌ల ఆధారంగా, పాన్ ఇండియా లెవ‌ల్లో సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. ఇప్ప‌టికే బాలివుడ్‌లో బాజీరావు మ‌స్తానీ, ప‌ద్మావ‌తి, మ‌ణిక‌ర్ణ సినిమాలు, ఇటీవ‌లే తానాజీ తెర‌కెక్క‌గా, తెలుగులో రుద్ర‌మ‌దేవి, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, సైరా న‌ర్సింహారెడ్డి చిత్రాలు తెర‌పై ఆవిష్కృత‌మ‌వ‌డ‌మేగాక ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో కుమ్రంభీం, అల్లూరి సీతారామరాజు జీవితాల‌ను ఆధారంగా చేసుకుని క‌ల్పింత క‌థాంశంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ తెర‌కెక్కుతున్న‌ది. ఇప్ప్పుడు తాజాగా మ‌రో బ‌యోపిక్ తెర‌కెక్క‌నున్న‌ది. మ‌రాఠా యోధుడు, అఖండ హిందూ సామ్రాజ్య‌ధినేత‌గా పేరు పొందిన చ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ జీవిత గాథ సిల్వ‌ర్ స్ర్కీన్‌పై ఆవిష్కృతం కానున్న‌ది.

ఆ మహనీయుడు జయంతి సందర్భంగా అందుకు సంబంధించిన సంబంధించిన అంశాల‌ను చిత్ర బృందం ప్ర‌క‌టించింది. శివాజీ జీవిత కథను మూడు భాగాలుగా తెర‌కెక్కిస్తుండ‌గా, ప్రముఖ బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ లీడ్ రోల్ పోషించ‌నున్నారు. మరాఠీ చిత్రం ‘సైరత్’ ఫేమ్ నాగరాజ్ మంజులే ఈ భారీ ప్రాజెక్ట్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నుండ‌గా, బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ బాణీల‌ను స‌మ‌కూర్చ‌నున్నారు. ఇక సినిమా మొదటి భాగానికి ‘శివాజీ’ అని.. రెండో భాగానికి ‘రాజా శివాజీ’ మూడో భాగానికి ‘ఛత్రపతి శివాజీ’ అని టైటిల్ ఫిక్స్ చేయ‌డ‌మేగాక‌,. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. వచ్చే యేడాది ఈ చిత్రం మూడు భాగాల‌ను కూడా కొన్ని నెలల వ్య‌వ‌ధిలోనే విడుదల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా ఇప్పటి వరకు ఛత్రపతి శివాజీ జీవితం పై భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పూర్తి స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు. బాలివుడ్‌లో ‘తానాజీ’, గ‌తంలో తెలుగులో అక్కినేని నాగేశ్వ‌ర్‌రావు న‌టించిన‌ ‘భక్త తుకారాం’ సినిమాల్లో శివాజీ పాత్ర మనకు కనిపించినా పూర్తిస్థాయిగా ఆ జీవితాన్ని ఎవ‌రూ తెర‌కెక్కించ‌లేదు.

Tags: chatrapathi shivaji maharaj, nagaraj manjule, ritesh dwshmuk