‘ బ్రో ‘ – ది అవ‌తార్ రివ్యూ…రేటింగ్ : పవన్ కళ్యాణ్, సాయి తేజ్ ల సినిమా ఎలా ఉందంటే

bro the avathar movie review

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన బ్రో ది అవ‌తార్ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భీమ్లానాయ‌క్ సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని చేసిన సినిమా బ్రో ది అవ‌తార్‌. కోలీవుడ్‌లో హిట్ అయిన వినోద‌య సీతం సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా కాగా.. ప‌వ‌న్‌ది కీ రోల్‌. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, మాట‌లు అందించారు. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
మార్కండేయ అలియాస్ మార్క్(సాయి ధరమ్ తేజ్) బాగా స్వార్థపరుడు. తన ప్రయోజనాలు తప్ప ఇతరుల గురించి ఏ మాత్రం ఆలోచించడు. చివరికి సొంత ఫ్యామిలీని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. అలాంటి మార్క్ ఊహించని ప్రమాదంలో చ‌నిపోతాడు. అప్పుడు గాడ్ ఆఫ్ టైం (పవన్ కళ్యాణ్) ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ మ‌లుపులు తిరుగుతుంది. చనిపోయిన మార్క్ కి సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. గాడ్ ఆఫ్ టైం మార్క్ జీవితంలోకి వచ్చాక అస‌లేం ఏం జరిగింది? అతడి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంద‌న్న‌దే సినిమా క‌థ‌.

విశ్లేష‌ణ :
ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ ఎనర్జీ, మాస్ ఎంట్రీ హైలెట్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సీన్లు మాత్రం ప్రేక్ష‌కుల‌ను అలరిస్తాయి. పవన్ డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ప‌వ‌న్ ఫ్యాన్స్ అయితే ఈ సీన్లు, డైలాగులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు. ఆయన డాన్సులు, టైమింగ్ జోక్స్ ఆకట్టుకుంటాయి. థ‌మ‌న్ ఎన‌ర్జిటిక్ మ్యూజిక్ చాలా బాగుంది.

త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ మీద ఊహించిన‌ట్టుగానే రాసిన పొలిటిక‌ల్ డైలాగులు బాగున్నాయి. ముఖ్యంగా గాజు గ్లాసు మీద డైలాగులు అయితే అదుర్స్‌. ప‌వ‌న్ వ‌న్ మ్యాన్ షో చేసి ప‌డేశాడు. అయితే సాయిధ‌ర‌మ్ కూడా మావ‌య్య‌కు పోటీగా న‌టించాడు. పాత్ర స్వ‌భావం దృష్ట్యా సాయిది కాస్త డామినేటింగ్ రోల్ కూడా అయ్యిందంటున్నారు. క‌థ‌, స్క్రీన్ ప్లే యావ‌రేజ్‌గా ఉంద‌ని.. ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ పాత్ర‌పై ఎక్కువుగా ఫోక‌స్ పెట్ట‌డంతో క‌థ‌లో అంత బ‌లం లేకుండా పోయింద‌న్న టాక్ ఓవ‌ర్సీస్ నుంచి వ‌స్తోంది.

పవన్ కెరీర్‌లో హిట్ అయిన ప్రతి పాట సినిమాలో ఎక్కడో ఒకచోట కవర్ అవుతూ.. సినిమా గ్రాఫ్‌ను అలా ఉంచేందుకు వాడుకున్న‌ట్టుగా ఉంది. అయితే ఇదే సినిమాకు బలంతో పాటు మైనస్ కూడా అయ్యింది. ఎందుకంటే పవన్ ఎలిమెంట్‌లను బ‌ల‌వంతంగా నెట్టడం తప్ప టీమ్ ఫోకస్ కథ లేదా సన్నివేశాల‌పై అంత‌గా క‌స‌ర‌త్తులు చేసిన‌ట్టుగా లేదు.

వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ బిగ్‌స్క్రీన్ పై నాసిర‌కంగా ఉంద‌ని.. ప‌వ‌న్ రేంజ్‌కు త‌గ్గ విజువ‌ల్స్ కావ‌నే చెపుతున్నారు. కొన్ని సీన్లు వాస్త‌వానికి దూరంగా ఉన్నాయంటున్నారు. అయితే క్లైమాక్స్ మాత్రం బాగుంది. ఫిలాసఫీ టచ్‌ ఇస్తూ ప్రాక్టికల్ గా చెప్పిన తీరు ఆకట్టుకునేలా హైలైట్ గా నిలుస్తుంది. ఇక్కడ రైటింగ్‌ బాగుందని అంటున్నారు.

ఫైన‌ల్ రిపోర్ట్‌:
ఈ సినిమా కేవ‌లం ప‌వ‌న్ వీరాభిమానుల కోసం మాత్ర‌మే. ప‌వ‌న్‌ను అలా స్క్రీన్ మీద చూస్తూ ఎంజాయ్ చేసేవారికి.. ప‌వ‌న్ మేన‌రిజ‌మ్స్ పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చే వారికి బ్రో బాగా న‌చ్చుతుంది. మిగిలిన వారికి జ‌స్ట్ యావ‌రేజ్‌, బిలో యావ‌రేజ్ సినిమా మాత్ర‌మే. ప‌వ‌న్ పాత్ర‌ను క‌మ‌ర్షియ‌ల్‌గా ఎలివేట్ చేసేందుకు, ప‌వ‌న్‌ను హైలెట్ చేసేందుకే తీసిన సినిమా ఇది. దీంతో సినిమా మెయిన్ సోల్ మిస్ అయ్యింది. థ‌మ‌న్ ఎన‌ర్జిటిక్ బీజీఎం బాగుంది. ఓవ‌రాల్‌గా ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. కామ‌న్ ఆడియెన్స్‌కు జ‌స్ట్ యావ‌రేజ్‌.

ఫైన‌ల్ పంచ్‌: ప‌వ‌న్ ఫ్యాన్స్ కేనా బ్రో