పలాస 1978 అనే వైవిధ్యభరితమైన సినిమాతో తెలుగులో చక్కటి గుర్తింపు సాధించిన దర్శకుడు కరుణ కుమార్. ఈ సినిమా తర్వాత కరుణ కుమార్ సుధీర్ బాబు హీరోగా శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా తీశాడు. డిఫరెంట్ జోనర్ లో సినిమాలు తీసే కరుణ్ కుమార్ ఈసారి మాత్రం ఇందుకు భిన్నంగా కళాపురం అనే కామెడీ సినిమాను తెరకెక్కించాడు. ‘ ఈ ఊరిలో అందరూ కళాకారులే ‘ అనేది క్యాప్షన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 26వ తేదీన విడుదల కానుంది.
ఇది వరకే విడుదలైన కళాపురం ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఆకట్టుకోగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. పవర్ స్టార్ పవన్(pawan kalyan) కళ్యాణ్ కళాపురం ట్రైలర్ ను తాజాగా లాంచ్ చేశారు. సినిమా విజయవంతం కావాలని మేకర్స్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ట్రైలర్ ఒక నిమిషం 57 సెకన్ల నిడివి ఉంది. కళాపురానికి చెందిన ఒక వ్యక్తి తమ గ్రామంలో ఒక సినిమా తెరకెక్కించాలన్న కండీషన్ మీద నిర్మాతగా మారతాడు. అయితే అతడి వద్ద ఉన్న డబ్బు కోసం పోలీసులు, విలన్ ఎంట్రీ ఇస్తారు. వీటిని ఎదుర్కొని దర్శకుడు, నిర్మాత ఈ సినిమాను ఎలా పూర్తిచేశారన్నదే ఈ చిత్ర కథాంశం.
సత్యం సినిమాతో పరిచయమై సత్యం రాజేష్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజేష్ ఈ సినిమాలో దర్శకుడి పాత్రలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో చిత్రం శ్రీను, రక్షిత్ అట్లూరి తదితరులు నటించారు. జి స్టూడియోస్ ఆర్ ఫోర్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించారు. కళాపురం సినిమా అయినా కరుణ కుమార్ కు కమర్షియల్ హిట్ ఇస్తుందేమో చూడాలి.