ఐటీ సోదాలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శిగా వద్ద భారీగా వేల కోట్ల అవినీతికి సంబంధించిన లెక్కలు బయటపడ్డాయని, ఇది గోరంత మాత్రమేనని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇంకా భారీ మొత్తంలో అవినీతి సొమ్ము బయటపడనుందని ఆరోపిస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. ఐటీ దాడులకు, టీడీపీ సంబంధమేంటని, అసలు అవినీతిలో కూరుకుపోయి కోర్టుల చుట్టు తిరుగుతున్న సీఎం జగన్‌కు దీనిపై మాట్లాడే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా దీనిపై చంద్రబాబు తనయకుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సైతం స్పందించారు. ట్విట్టర్ వేదికగా అధికార వైసీపీపై విరుచుకుపడ్డారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో 40 చోట్ల సోదాలు చేస్తే 85 లక్షలు దొరికాయని ఐటీ శాఖ స్పష్టం చేస్తే, రూ. 2 వేల కోట్లు దొరికాయి అని తప్పుడు ప్రచారం చేస్తూ వైకాపా నాయకులపై మండిపడ్డారు. టీడీపీపై విషప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని ఘాటుగా విమర్శించారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు జగన్‌కు లోకమంతా అవినీతి కనపడటంలో పెద్దగా ఆశ్చర్యమేమీ లేదని ఆరోపించారు. ఐటీ రైడ్స్‌లో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వారిచ్చిన పత్రికా ప్రకటన ద్వారానే అర్ధమైందని లోకేశ్ వ్యాఖ్యానించారు. రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుంని వ్యంగాస్ర్తాలను సంధించారు. తన పోస్టుతో పాటు సాక్షి మీడియాలో ప్రచురితమైన కథనాన్ని నారా లోకేష్ జోడించారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.