ప్లాస్టిక్ వల్ల వాటిల్లుతున్న అనార్థాలు.. మానవాళికి పొంచి ఉన్న ముప్పు అంతా ఇంతా కాదు. ఆలస్యంగానైనా ప్రభుత్వాలు దీనిని గుర్తించాయి. నివారణ చర్యలను చేపట్టాయి. ప్లాస్టిక్ నిషేధంపై పోరును సల్పుతున్నాయి. పాలిథిన్ కవర్ల వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నాయి. అదేవిధంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోనూ ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి చెక్కు పెడుతున్నాయి. అందులో భాగంగా కలియుగ దైవం.. శ్రీవేంకటేశ్వరుడి సన్నిధానంలో ఇప్పటికే ప్లాస్టిక్‌ను నిషిధించింది టీటీడీ. తాజాగా మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిందేందుకు చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు.
అదేమిటంటే.. తిరుమల కొండపై ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించాలని నిర్ణయించింది. వాటి స్థానంలో గాజు నీళ్ల సీసాలను (నీళ్ల బాటిళ్లు) ప్రవేశపెట్టేందుకు ప్రణాళికను రూపొందించింది. ఇప్పటికే ప్లా స్టిక్/ నీళ్ల సీసాల విక్రయాలను టీటీడీ రద్దు చేసింది. అయినప్పటికీ దేశ నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు తాగునీటి కోసం ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బందులు లేకుండా చూస్తూనే గాజు సీసాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉత్తర భారతంలో అధికంగా వాడుతున్న గాజు నీళ్ల సీసాలను ప్రవేశపెడితే బాగుంటుందని నిర్ణయించింది. అందులో భాగంగా ‘బిస్సెల్స్’ సంస్థ గాజు నీళ్ల సీసాలను తిరుమలలో పదిరోజులపాటు ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. రూ.20 ధర కలిగిన నీటితో ఉన్న గాజు సీసాను కొండపై అన్ని దుకాణాల్లో విక్రయిస్తారు. యాత్రికులు తమ వెంట ఆ బాటిల్‌ను తీసుకువెళ్లాలంటే అదనంగా మరో రూ.20 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదీగాక ఆ ఖాళీ బాటిల్‌ను ఏ దుకాణంలో అప్పగించినా రూ.20 తిరిగి ఇచ్చేలా విధానం రూపొందించడం విశేషం. ఒకటి-రెండ్రోజుల్లో ఆ బాటిళ్లు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.