పలాసలో హైడ్రామా.. లోకేష్ ని అడ్డుకున్న పోలీసులు..!

శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆదివారం ఉదయం నుంచి హైడ్రామా నెలకొన్నది. పలాస పర్యటనకు వెళ్లిన నారా లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం .. మరోవైపు పలాస పట్టణంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించడం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పలాసలో రాజకీయం వేడెక్కింది. లోకేశ్ ను అడ్డుకోవడం అప్రజాస్వామికం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. మరోవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పలాస ఘటనకు నేపథ్యమిదీ..

పలాస‌లో 27‌వ వార్డు కౌన్సిలర్, టీడీపీ నేత సూర్య నారాయణ చెరువును ఆక్రమించి ఇళ్లు అక్రమంగా నిర్మించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగి.. అక్రమ కట్టడాలను కూల్చేసేందుకు ప్రయత్నించారు. కాగా దీన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఇదిలా ఉంటే స్థానిక టీడీపీ నేత గౌతు శిరీష .. మంత్రి సీదిరి అప్పలరాజుకు వ్యతిరేకంగా వ్యక్తిగత ఆరోపణలు చేశారు. దీంతో ఆమె వెంటనే మంత్రికి క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి.

ఈ ఉద్రిక్తతల నడుమ నేడు నారా లోకేశ్ పలాసలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఇదే రోజు వైసీపీ శ్రేణులు .. టీడీపీ కార్యాలయ ముట్టడికి యత్నించాయి. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పట్టణంలో 144 సెక్షన్ విధించినట్టు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ వైసీపీ శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించాయి.

ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. టీడీపీ నేతల ఆక్రమణలను తొలగిస్తుంటే.. పేదల ఇళ్లను తొలగిస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలు కొండలు, చెరువులను కూడా వదిలిపెట్టలేదు. టీడీపీ నేతల చెరలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటాము’ అని స్పష్టం చేశారు. మొత్తంగా పలాస రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది.

Tags: AP, nara lokesh, nara lokesh arrest palasa, Palasa, tdp, YS Jagan, ysrcp