పార్టమెంట్ దృష్టికి ఏపీ రాజకీయాలను తీసుకెళ్లారు ఎంపీ గల్లా జయదేవ్. తనపై ఏపీ వైసీపీ సర్కారు భౌతిక దాడికి పాల్పడిందని ఆరోపించారు. 13 గంటల పాటు మానసికంగా హించారని వాపోయారు. ఇంతకీ విషయమేమిటంటే మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు కు నిరసనగా అమరావతి ప్రాంత రైతులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో పాల్గొన్న ఎంపీ గల్లా జయదేవ్‌ను పోలీసులు అరెస్టు చేయగా ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి విధితమే. ఆ అంశాన్ని ఎంపీ జయదేవ్ పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రివిలేజ్ మోషన్ నోటీసును స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ జయదేవ్ మాట్లాడుతూ అనాటి ఘటనను వివరించారు. ఏపీ వైసీపీ సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహిరిస్తున్నదని ఆరోపించారు. రాజధాని రద్దును నిరసిస్తూ రైతులు చేస్తన్న శాంతియుత పోరాటానికి మద్దతు తెలిపానని, చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లానని వివరించారు. అయినప్పటికీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆయన వాపోయారు. తనను సుమారు 13 గంటల పాటు స్టేషన్లకు తిప్పుతూ మానసికంగా హింసించారని, చొక్కాను సైతం చించారని వాపోయారు. అదీగాక అక్రమ కేసులను బనాయించారని వివరించారు. రైతులను పట్టించుకోవడం లేదని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు.