జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ప్రధాన కారణం అదేనా…?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్న జగన్ ప్రదాని నరేంద్ర మోడీ తో పాటుగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షా సహా పలువురితో ఆయన భేటి అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్ట్, రైల్వే జోన్ పై స్పష్టత సహా విభజన చట్టం అమలు వంటి విషయాలను చర్చించే అవకాశ౦ ఉంది.

మూడు రాజధానులు, మండలి విషయంలో కూడా జగన్, మోడితో చర్చలు జరిపే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో విషయం బయటకు వచ్చింది. జగన్ ని ఎన్డియే లో చేర్చుకునే విషయమై ప్రధాని నేరుగా ప్రస్తావించే అవకాశం ఉందని అంటున్నారు. దేశ రాజధాని ఓటమి, మహారాష్ట్ర, ఝార్ఖండ్ లో అధికారం కోల్పోవడం వంటివి బిజెపిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.

బీహార్ లో కూడా గెలిచే పరిస్థితి కనపడటం లేదు. దీనికి తోడు ప్రశాంత్ కిషోర్ దెబ్బ బిజెపికి గట్టిగానే తగిలే అవకాశం ఉంది. తాను నేర్పిన కొన్ని రాజకీయాలను బిజెపి చేస్తుంది అని, వాటిని ప్రత్యర్ధులకు వివరించి పరిష్కారాలు కూడా చూపించి ముందుకి వెళ్తున్నారు ప్రశాంత్ కిషోర్. దీనితో బిజెపి వ్యతిరేక పవనాలు ఇక బలంగా వీచే అవకాశం కనపడుతుంది. దీనితోనే బిజెపి అధిష్టానం జాగ్రత్తపడుతుంది.

ఇదే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని భావిస్తుంది ఆ పార్టీ. ప్రస్తుతానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయినా భవిష్యత్తులో మాత్రం ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే బలంగా ఉండే పార్టీలను చేర్చుకునే యోచనలో మోడీ ఉన్నారు. అందుకే ఇప్పుడు జగన్ ని చేర్చుకోవాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి.

Tags: bjp, Delhi Tour, modi, YS Jagan, ysrcp