వైసీపీ నాయకుడు, పలాస ఎమ్మెల్యే కమ్ మంత్రి సీదిరి అప్పలరాజుకు.. మూడు విషయాలు సెగ పెడుతు న్నాయనే చర్చ వైసీపీలోనే జోరుగా సాగుతుండడం గమనార్హం. నిజానికి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. సీఎం జగన్ ఆయనకు పట్టం కట్టారు. ఎవరికీ ఇవ్వని రీతిలో మంత్రి పదవిని అప్పగించారు. అంతేకాదు.. రెండో సారి కూడా (తొలిసారి మంత్రివర్గంలో లేటుగా మంత్రి వర్గంలోకి తీసుకున్నారు) కొనసాగించారు. వాస్తవానికి అప్పటికే జిల్లాలో సీనియర్లు చాలా మంది ఉన్నా.. సీదిరికి పెద్ద పీట వేశారు.
అలాంటి అప్పలరాజుకు ఇప్పుడు ఎన్నికల ముందు.. ప్రధానంగా మూడు విషయాలు సెగపెడుతున్నాయ ని అంటున్నారు సొంత పార్టీ నాయకులు. ఏ ఇద్దరు నాయకులు కలిసినా.. సీదిరి పరిస్థితి ఏం బాగోలేదు! అనే చర్చించుకుంటున్నారు. మరి ఆ మూడు విషయాలు ఏంటి? అనేది ఇటు నియోజకవర్గంలోనూ.. ఆసక్తిగా మారింది. ఇక, సొంత పార్టీ నేతలపై మరింత ఎక్కువగానే దీనిపై దృష్టి పెట్టాయట.
1) ఐప్యాక్ సర్వేలో మైనస్‌లు: రాష్ట్ర వ్యాప్తంగా నేతల పరిస్థితిని అంచనా వేసేందుకు సీఎం జగన్ చేయిస్తున్న ఐప్యాక్ సర్వేల్లో మంత్రి సీదిరికి మైనస్ మార్కులు వచ్చినట్టు తాడేపల్లి వర్గాల ద్వారా.. పార్టీ నేతలకు తెలిసిపోయిందన్న ప్రచారం సొంత పార్టీ నేతల్లోనే విస్తృతంగా జరుగుతోంది. ప్రజలకు అందుబాటులో ఉండాలని చెబుతుంటే.. ఆ ఒక్కటి తప్ప.. వివాదాలకు ఆయన అందుబాటులో ఉంటున్నారని, దీంతో ప్రజలపై అభిప్రాయం మారిపోయిందని అంటున్నారట. ఫలితంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. జిల్లాలో ఓడిపోయే ప్రథమ స్థానం ఇదేనని ఐప్యాక్ తేల్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
2) అధికార దర్పం: ఇక, ఈ విషయం స్థానికంగా వైసీపీ నేతల మధ్య గత ఏడాదిగా జోరుగా సాగుతోంది. జిల్లాలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా కూడా.. వారిని పక్కన పెట్టి సీఎం జగన్ సీదిరికి మంత్రి పదవి అప్పగించారు. ఉదాహరణకు ధర్మాన వంటివారికి ఎప్పుడో కానీ మంత్రులుగా గుర్తింపు రాలేదు. అంటే..వారు రెండు సార్లు గెలిచిన తర్వాత.. మంత్రులుగా ఛాన్స్ లభిస్తే.. సీదిరి కి ఫస్ట్ విజయంలోనే మంత్రి పదవి దక్కడం గమనార్హం. మరి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా.. అధికార దర్పం ప్రదర్శిస్తున్నారనేది వైసీపీ నేతల అంతర్మథనం.
3) సామాజికవర్గంలోనూ సెగ: సాధారణంగా ఏ నాయకుడికైనా.. తన బలం సొంత సామాజిక వర్గంలోనే ఉంటుంది. ఇతర సమస్యలు విమర్శలు ఎలా ఉన్నా.. సామాజిక వర్గం బలం అండగా ఉంటే.. ఆ నేతలకు తిరుగు ఉండదని రాజకీయంగా నాయకులు విశ్వసిస్తారు. సీదిరికి కూడా గత ఎన్నికల్లో సొంత సామాజిక వర్గం అండగా ఉంది. అయితే.. ఆయన ఈ వర్గంలోనూ ఒకవైపే చూస్తున్నారని.. మిగిలిన వారిని పక్కన పెట్టారని.. జెండో మోసిన వారిని పట్టించుకోవడం లేదని.. పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తుండడం గమనార్హం.
కొసమెరుపు: ఈ మూడు కారణాలు.. సదరు ఎమ్మెల్యే కమ్ మంత్రి సీదిరి అప్పలరాజుకు కంటిపై కునుకు లేకుండా చేస్తోందని అంటున్నారు వైసీపీ నాయకులు. ఇది అంతర్గతంగా జరుగుతున్న చర్చే అయినా.. వచ్చే ఎన్నికలకు ఎక్కువగా సమయం లేదు కనుక.. ఈ చర్చ పెరిగి పెద్దదయితే.. కష్టమనే భావన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.