చేనేత కార్మికులకు అండగా నిలిచిన మహేష్-నమ్రత జంట.. ఏమైందంటే

సినీ హీరోలకు ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుతుంది. ఇక స్టార్ హీరోలు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారికి రూ.50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుతోందని వినికిడి. అంతేకాకుండా ఇతర అడ్వర్టయిజ్‌మెంట్లు చేస్తూ, వివిధ బ్రాండ్లకు అంబాసిడర్లుగా ఉంటూ మరింత సంపాదిస్తున్నారు. స్టార్ హీరోలు అంటే ఇదే అభిప్రాయం అందరికీ ఉంటుంది. అయితే వారికి వచ్చిన డబ్బును తమ స్వంతానికే వారు వినియోగించుకోరు. కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సాయం అందిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకుని, తామున్నామంటూ భరోసా ఇస్తారు. ఇక తెరపై శ్రీమంతుడు మహేష్ బాబు నిజజీవితంలోనూ తన ఉదారత చాటుకున్నారు. భార్య నమ్రతతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల ఓ చేనేత కుటుంబానికి మహేష్ దంపతులు అండగా నిలించారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఎంతో మంది చిన్నారులకు గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు చేయించిన మహేష్ బాబు వారి ప్రాణాలను కాపాడుతున్నాడు. ఇక సినిమాలు పూర్తైన తర్వాత విదేశాలకు వెళ్లే ఆయన మన మారుమూల ప్రదేశాల్లో జరిగే విషయాలను కూలంకషంగా పట్టించుకుంటారు. అవసరమైన వారికి చేయూతనిస్తున్నారు. తాజాగా తెలంగాణలోని నారాయణపేటకు చెందిన చేనేత కుటుంబాలకు మహేష్-నమ్రత దంపతులు అండగా నిలిచారు. వారి కోసం ఆరుణ్య నారాయణ పేట అనే ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను వీరు నడుపుతున్నారు. ఇందులో చేనేత కార్మికులు నేసిన చీరలు, కళాఖండాలను విక్రయానికి పెడతారు. ఇలాంటి వెబ్‌సైట్‌ను మహేష్ బాబు దంపతులు ప్రమోట్ చేస్తుండడంతో అది విపరీతంగా వైరల్ అయింది.

చేనేత కుటుంబాల కోసం పైసా తీసుకోకుండా వారి ఉత్పత్తులు అందరికీ తెలిసేలా మహేష్ దంపతులు చేస్తున్నారు. ఆ వెబ్ సైట్ లింకును కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, వారి అభిమానులు మహేష్ దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వారు తమ మంచి మనసును మరోసారి చాటుకున్నారని అభినందిస్తున్నారు.

Tags: helping, helps, mahesh babu, photos, చేనేత కార్మికులు, మహేష్ బాబు