వ్య‌వసాయం వైపు.. మ‌రోసారి తెలుగు చిత్ర‌సీమ చూపు..!

ఎవ‌రైనా ఒక‌రు ఒక అంశాన్ని ప‌ట్టుకుని హిట్ కొట్టారంటే చాలు చిత్ర‌సీమ మొత్తం ఆ స‌బ్జెక్ట్‌పైనే దృష్టి సారిస్తుంది. వ‌రుస‌గా ఆ త‌ర‌హా క‌థాంశాల‌ను ఎంచుకుంటూ చిత్రాల‌ను నిర్మిస్తుంది. క‌థానాయ‌కులు సైతం దానిని అనుస‌రిస్తారు. అలాంటి క‌థ‌లకే మొగ్గుచూపుతుంటారు. అలా భార‌తీయ చిత్రసీమ‌లో ప్ర‌స్తుతం బ‌యోపిక్‌ల హ‌వా కొన‌సాగుతున్న‌ది. గ‌తంలోనూ ఇలాంటి సినిమాలు వ‌చ్చినా అవి ఒక‌టి అర మాత్ర‌మే. ఎవ‌రో ఒక ద‌ర్శ‌కుడు సాహ‌సం చేసి తీసేవాడు. కానీ ప్ర‌స్తుతం ప‌రిస్థితి పూర్తి భిన్నంగా మారింది. చారిత్ర‌క గాథ‌ల‌ను తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆస‌క్తిని చూపుతున్నారు. అదీగాక వాటిని దేశ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తూ ఖ్యాతిని పొంద‌డ‌మేగాక‌, క‌మ‌ర్షియ‌ల్గా ఎద‌గాల‌ని చూసుకుంటున్నారు. మ‌ణిక‌ర్ణిక‌, బాజీరావుమ‌స్తానీ, ప‌ద్మావ‌తి, తానాజీ చిత్రాలు ఆ కోవ‌లోనే వ‌చ్చాయి. ప్ర‌స్తుతం మ‌రో చారిత్ర‌క గాథ పొన్నియ‌న్ సెల్వం, ఛ‌త్ర‌ప‌తి శివాజీ ముస్తాబ‌వుతున్న‌ది. ఇక ముందు కూడా ఆ ప‌రంప‌ర కొన‌సాగే అవ‌కాశ‌ముంది.

ఇక తెలుగు సినీ ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌స్తే కూడా ఇంచుమించు అదే ప‌రిస్థితి. ఒక‌ప్పుడు పౌర‌ణిక చిత్రాలు తెలుగుతెర‌ను ఎలాయి. ఆ త‌రువాత వాటి స్థానాన్ని కుటుంబ క‌థ చిత్రాలు ఆక్ర‌మించాయి. మ‌ధ్య‌లో కొంత‌కాలం అభ్యుద‌య సినిమాలు ఒక ఊపు ఊపాయి. ఆ త‌రువాత ద‌శాబ్ద‌కాలం పాటు క‌మ‌ర్షియ‌ల్ మూవీల‌తో కాలం నెట్టుకొచ్చింది. కొత్త త‌రం రాక‌తో తెలుగు సినిమా కూడా కొత్త పుంత‌లు తొక్కుతున్న‌ది. బాలివుడ్ త‌ర‌హాలోనే బ‌యోపిక్‌ల ఒర‌వ‌డిలో సాగిపోతున్న‌ది. రుద్ర‌మ‌దేవి, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, సైరా, జార్జిరెడ్డి, ఎన్టీఆర్‌ సినిమాలు వ‌చ్చి సంద‌డి చేశాయి. తాజాగా కుమ్రం భీం, అల్లూరి సీతారామ‌రాజా పిరియాడిల్ డ్రామా తెర‌కెక్కుతున్న‌ది. క్రిష్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ కాంబినేష‌న్‌లోనూ ఓ చిత్రం రానున్న‌ది.

అయితే ఇటీవ‌ల కొద్ది కాలం నుంచి మ‌ళ్లీ చిత్ర‌సీమ త‌న రూటును మార్చ‌కున్న‌దేమోన‌ని అనిపిస్తున్న‌ది. దాని చూపు ఇప్పుడు వ్య‌వ‌సాయంపై ప‌డిన‌ట్లు తెలుస్తున్న‌ది. వ‌రుస‌గా అలాంటి క‌థాంశాల‌తోనే సినిమాలు వ‌స్తుండ‌డం అందుకు బ‌లాన్ని చేకూర్చుతున్న‌ది. అలా వ‌చ్చిన సినిమాల్లో ముఖ్యంగా మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఖైదీ నంబ‌ర్ 150. త‌మిళ సినిమా క‌త్తికి రీమేక్ ఇది. ఇక గ‌తేడాది ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన మ‌హ‌ర్షి సినిమా ఒక‌టి. అద‌యితే ఏకంగా వీకెండ్ అగ్రిక‌ల్చ‌ర్ అనే ట్రెండ్‌ను సృష్టించింది. ప్ర‌ధానంగా వ్య‌వ‌సాయం చుట్టూ తిరిగే క‌థాంశంతోనే ఈ సినిమాను నిర్మించారు. అటు త‌రువాత ఇటీవ‌ల విడుద‌లైన భీష్మ సినిమా కూడా అగ్రిక‌ల్చ‌ర్ బేస్డ్‌గా సాగడం గ‌మ‌నార్హం. ముఖ్యంగా సేంద్రియ వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌ను తెలుపుతూ, దానికి కొంచెం వినోదాన్ని జోడించి తీశారు. ఇక అదేబాట‌లో రానున్న‌ది శ‌ర్వానంద్ న‌టించిన శ్రీ‌కారం సినిమా. ఆ సినిమా క‌థ కూడా వ్య‌వ‌సాయం నేప‌థ్యంలోనే సాగ‌నుంది. ఉన్న‌త చ‌దువులు చ‌దివిన విద్యార్థి గ్రామంలో ఉంటూ సాగు ప‌నులు చేస్తుంటాడు. ఇది క‌థ ఇతివృత్తాంతం. ఇక సినియ‌ర్ న‌టి రేణూదేశాయ్ కూడా వ్య‌వ‌సాయం క‌థాంశం ప్ర‌ధానంగా చిన్న‌పిల్ల‌ల కోసం ఓ చిత్రాన్ని తీసేందుకు స‌న్నాహాల‌ను చేస్తున్న‌ది. అదేవిధంగా అదే బాట‌లో మ‌రికొంద‌రు ద‌ర్శ‌కులు క‌థ‌ల‌ను సిద్ధం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఇలా వ‌రుస‌పెట్టి వ్య‌వ‌సాయానికి సంబంధించిన క‌థాంశాల‌తో సినిమాలు వ‌స్తుండ‌డంపై అంద‌రిపై చూపు వాటిపై ప‌డింద‌ని చెప్ప‌క‌నే చెబుతున్న‌ది.

తెలుగు చిత్ర సీమ‌నే కాదు మిగ‌తా బాలివుడ్‌, కోలివుడ్‌, మాలివుడ్ల‌లోనూ ఇలాంటి త‌ర‌హా చిత్రాలు వ‌స్తుండ‌డం ఇక్క‌డ మ‌రో ప్ర‌త్యేక‌త‌. బాలివుడ్ విష‌యానికి వ‌స్తే గ‌తంలో పీప్లీ లైవ్ సినిమా సంచ‌ల‌నాన్ని సృష్టించింది. రైతు ఆత్మ‌హ‌త్య‌ల నేప‌థ్యంలో మీడియా అనుస‌రిస్తున్న తీరును అది ఎండ‌గ‌ట్టింది. ఆ త‌రువాత 2007 స‌మ్మ‌ర్‌, 2009లో కిసాన్ చిత్రాలు వ‌చ్చాయి. తాజాగా సడ్‌కి ఆంక్ సినిమా ముస్తాబ‌వుతున్న‌ది. ప్ర‌స్తుతం అలాంటి క‌థ‌తోనే మ‌రో సినిమా తెర‌కెక్కుతున్న‌ది. ఇక కోలివుడ్ విష‌యానికి వ‌స్తే కార్తి న‌టించిన చిన‌బాబు చిత్రం పూర్తిగా వ్య‌వ‌సాయానికి సంబంధించిన క‌థాంశ‌మే. సూర్య న‌టించిన ఎన్‌జీకే చిత్రం కూడా రైతుల‌కు సంబంధించిన అంశాల‌ను ప్ర‌స్తావించింది. మాలివుడ్‌లోనూ ఇలాంటి త‌ర‌హా చిత్రాలు రానున్నాయి. ఇలా ఎతావాతా మొత్తంగా చిత్ర‌సీమ చూపు వ్య‌వ‌సాయంపై వైపు ప‌డింది. అయితే దీనిలో క‌థాంశాన్ని బ‌లంగా చెప్ప‌కుండా క‌మ‌ర్షియ‌లైజ్ చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అయితే ఏద‌యితేనేం అందులోని స‌మ‌స్య‌లు అంతో కొంతో తెర‌వైకి వ‌స్తున్నాయ‌ని మిగ‌తావారు కౌంట‌ర్ ఇస్తుండ‌డం విశేషం.

Tags: agricultuer based movies, bheeshma, maharshi, srikaaram, Tollywood