అమాద్మీ పార్టీ రాజకీయాల్లోనే ఒక సంచలనం. ఇక మాజీ ఐఆర్ ఎస్ ఉద్యోగి, ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసామాన్య విజయాలతో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ముచ్చటగా మూడోసారి హస్తిన పీఠాన్ని అధిరోహించాడు. సరిగ్గా అదే సమయంలో రాజకీయ వర్గాల్లో కొంత కాలంగా ఒక ప్రచారం జోరందుకున్నది. ఏఏపీ జాతీయ పార్టీగా మారనుందనేది దాని సారాంశం. ఆ దిశగా కేజ్రీవాల్ ఇప్పటికే చకచకా పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. మరి అది సాధ్యమవుతుందా? బీజేపీని తట్టుకుని నిలబడుతుందా? అసలు అందుకు కారణాలున్నాయా? ఏ విధంగా దానిని కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి? అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్నలు. ఇప్పడివే అనుమానాలు.. సందేహాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి. చర్చకు తెరతీస్తున్నాయి. వాటిని మనం కూడా ఒకసారి విశ్లేషించుకుందాం.
దేశంలో బీజేపీ అధికారం అప్రతిహాతంగా సాగుతున్నది. 2014 కంటే గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన విజయాన్ని నమోదు చేసుకుంది. ముందెన్నడూ లేని విధంగా దక్షిణాదిలో కూడా కొన్ని చోట్ల ప్రభావం చూపగలిగింది. మరోవైపు దేశంలో ఆర్థక మందగమనం. నానాటికి పెరుగుతున్న ఆర్థిక అసమానతలు. నిరుద్యోగం. జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ అందుకు నివారణగా చేపడుతున్న చర్యలు మాత్రం శూన్యం. మరోవైపు ఉన్న గడిచిన ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడి పోయింది. ఇక పశ్చిమబెంగాల్, మహారాష్ర్ట పలు రాష్ర్టాలు తమ గొంతును వినిపిస్తున్నా అవి అక్కడికే పరిమితమవుతున్నాయి. అదీగాక ఆయా పార్టీల సీఎంలకు దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు, పలుకుబడి నామమాత్రమేనని చెప్పవచ్చు. ఇక తెలుగు రాష్ర్టాలైన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఏ అంశంపై ఎప్పుడు ఎలా స్పందిస్తారన్నది సందేహాంగా మారింది. తమ రాష్ర్టాల, రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని అపవాదును మూటగట్టుకున్నారు. ఫలితంగా జాతీయ స్థాయిలో ప్రజల గొంతుకను బలంగా వినిపించగల పార్టీ ఏ ఒక్కటీ కూడా కనిపించడం లేదు. సూటిగా చెప్పాలంటే రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇప్పుడిదే ఏఏపీకి సానుకూలంశంగా మారనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అరవింద్ కే్జ్రీవాల్ ఇప్పటికే దేశరాజధానిలో బీజీపీని మూడు సార్లు ఢీకొట్టాడు. అంతే కాదు పరిపాలనలతో కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. సామాన్యుల గుండెల్లోకి చేరిపోయాడు. ఇప్పుడు వ్యక్తిగత ఇమేజ్‌లో మోడీ సరసన చేరిపోయాడు. ఇదే ఏఏపీకి బలంగా మారే అవకాశమున్నది. జాతీయ పార్టీగా మారేందుకు దోహదపడుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని ఇతర రాష్ర్టాలకు విస్తరించాలనే యోచనలో కే్జ్రీ ఉన్నట్లు సన్నిహితులు వివరిస్తున్నారు. గతంలో పార్టీని ప్రకటించిన సమయంలో ఆ దిశగా ప్రయత్నాలు చేసినా అంతగా సక్సెస్ కాలేదు. అప్పటి వరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పడు అరవింద్ సీఎం కాదు. కొంతలో కొంత కాంగ్రెస్ బలంగా ఉన్నది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. అరవింద్ తానెంటో నిరూపించుకున్నాడు. కాబట్టి మిగతా ఉత్తరాది రాష్ర్టాల్లోనూ ప్రభావం చూపగలిగే అవకాశముందని రాజకీయ పండితులు భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఏఏపీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ సానుకూల పవనాలను ఆధారంగా చేసుకునే ఏఏపీ కూడా జాతీయ పార్టీగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. బీహార్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యనా, పంజాబ్ తదితర చోట్ల పాగా వేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంటుంది.
అదీగాక ముందుగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిని సారించింది. ఇప్పటికే ఆ ఢిల్లీలో సభ్య నమోదుకు శ్రీకారం చుట్టింది. అదేవిధంగా మిగతా ఉత్తరాది రాష్ర్టాల్లోనూ చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే కేజ్రీకి మిగతా రాష్ర్టాల, ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాల ముఖ్యమంత్రులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అవికూడా ఆయనకు పనికి వస్తాయని ప్రచారం సాగుతున్నది.
ఇక అన్నింటికంటే ముఖ్యమైన మరో అంశం మేమిటంటే ఇటీవలే రాజకీయ ఎన్నికల వ్యూహకర్త పీకేకు ఏఏపీ బంపర్ ఇచ్చిందని సమాచారం. స్వయంగా సీఎం కేజ్రీవాల్ కూడా బాహటంగా స్పష్టం చేశారు. ఏఏపీలో చేరితే తాము స్వాగతిస్తామని ప్రకటించి సంచలనం రేపారు. అదే ఆమ్మాద్మీ పార్టీ జాతీయవిస్తరణకు మరింత బలాన్ని చేకూర్చుతున్నది. ఈ శతాబ్ది రాజకీయాల్లో అత్యంత ప్రభావశీలుడిగా పేరున్న పీకే ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం రాలేదు. కానీ పరోక్షంగా ఏఏపీ, ఏపీలో వైసీపీ గెలుపులో కీలకభూమికను పోషించారు. ప్రస్తుతం బెంగల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే కోసం పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీకేను కలుపుకుని ముందుకుసాగితే రాజకీయంగా బాగా కలిసివస్తుందని కేజ్రీవాల్ ఎత్తుగడని తెలుస్తున్నది. అందులో భాగంగానే ఆ ఆఫర్ ఇచ్చారని ప్రచారం జోరుగా సాగుతున్నది. ఇప్పుడంతా పీకే నిర్ణయంపైనా ఉత్కంఠత నెలకొంది. ఏది ఎలా ఉన్నా రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో పెనుమార్పులు రానున్నది మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది. మరి ఏఏపీ కేజ్రీవాల్ ఎంత మేరకు ఆ దిశలో విజయవంతం అవుతాడో చూడాలి.