ప్రేమ పిచ్చి పిక్స్ కి..ప్రియుడి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకున్న యువతి

ప్రేమమత్తులో యువతీయువకులు చేసే పనులు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని.. కోపాన్ని కూడా కలిగిస్తాయి. ఒక్కోసారి ప్రేమ ఉన్మాదం తీవ్రమై ప్రేమించడం లేదని యాసిడ్ పోయడం, నరికి చంపడం కూడా చూస్తూనే ఉన్నాం. అసోంకు చెందిన ఓ యువతి మాత్రం ప్రేమ కోసం ఎవరూ చేయని పని చేసింది. అసోం రాష్ట్రం కామ్ రూప్ జిల్లా సువల్ కచి ఓ గ్రామానికి చెందిన 19ఏళ్ల యువతి ..ఓ యువకుడిని ప్రేమిస్తోంది. వీళ్ల వ్యవహారం తెలిసి పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. మరోవైపు యువకుడికి హెచ్ ఐవీ ఉన్నట్టు ఇటీవల తేలింది. దీంతో యువతి తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. యువతిని ఎక్కడికీ పంపించడం లేదు.

యువతి మాత్రం తాను ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబడుతోంది. ఇటీవల సదరు యువతి.. యువకుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే తల్లిదండ్రులు ఆమెను వెతికి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి యువకుడి కోసం వెళ్లిన అమ్మాయి.. అతడి రక్తాన్ని సిరంజితో తీసి తన శరీరంలోకి ఎక్కించుకుంది. తమను ఎవరూ విడదీయకూడదనే ఈ పని చేసినట్టు ఆమె చెప్పింది.

మరోవైపు యువతికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఏం చేయాలో అర్థంకాక పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ప్రేమ నిలుపుకోవడం కోసం యువతి చేసిన పిచ్చి పనిపై ఇది ఉన్మాదమనే విమర్శలు వస్తుండగా.. సదరు యువతి మాత్రం తనని తాను సమర్థించుకుంది. తన ప్రేమ నిలుపుకోవడం కోసం తనకు మరో మార్గం కనిపించ లేదని అందుకే ఈ పనికి పాల్పడినట్లు పేర్కొంది.

Tags: assam, hiv infected blood, lover infused