తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నాయి. సోమవారం నుంచి ఎన్నికల పోలింగ్ గడువు తేదీ(నవంబరు 30)కి కేవలం పది రోజుల గడువు మాత్రమే ఉన్ననేపథ్యంలో అన్ని పార్టీలూ మరింతగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్న విషయం తెలిసిందే.
సీఎం కేసీఆర్.. ఒకే రోజు రెండు మూడు జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక, కాంగ్రెస్ కూడా ఇదే దూకుడు ప్రదర్శిస్తోంది. ఎటొచ్చీ.. బీజేపీ మాత్రం ఈ రేంజ్‌లో కొంత వెనుకబడింది. అయితే.. ఇప్పుడు సోమవారం నుంచి ఈ పార్టీ కూడా దూకుడుగా ముందుకు సాగేందుకు రెడీ అయింది. బీఆర్ ఎస్ వ్యూహం మరింత పెంచింది. రోజుకు రెండు మూడు జిల్లాల నుంచి ఏకంగా ఐదారు జిల్లాల స్తాయిలో కేసీఆర్ ప్రచారం చేయనున్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకులు. రాముల్, ప్రియాంక గాంధీ సహా కేంద్ర మాజీ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్లు కూడా ఇక, రాష్ట్రానికి పోటెత్తనున్నారు. వారు కూడా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఉత్తర తెలంగాణలో బీఆర్ ఎస్‌కు ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అదేవిధంగా బీజేపీ కూడా అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. ప్రధాని మోడీ ఈ పది రోజుల్లో మూడు నుంచి నాలుగు సార్లు ప్రచారం చేయనున్నారు.
కేంద్ర హోం మంత్రి, పార్టీ అగ్రనేత అమిత్ షా ఐదు రోజుల పాటు ఇక్కడే ఉండి పార్టీని పరుగులు పెట్టించాలని నిర్ణయించారు. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షడు నడ్డా కూడా తెలంగాణలోనే పాగా వేయనున్నారు. ఈయన ఎన్నికల గడువు వరకు ఇక్కడే ఉండనున్నారు. దీంతో ఈ మూడు పార్టీల ప్రచారం ముమ్మరంగా సాగుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఇదిలావుంటే.. ఇక, అంతర్గత చర్చల్లో పంపకాల వ్యవహారం ప్రధానంగా తెరమీదికి వస్తోంది. కాదు కాదంటూనే కీలక పార్టీలు ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో నే పంపకాలకు కూడా శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. పంపకాలకు వ్యతిరేకం అనే బీజేపీలోనూ కొందరు గెలుపు గుర్రం ఎక్కాలంటే.. పంపకాలు తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఇక, కాంగ్రెస్ నేతలు కూడా ఇదే పాటిస్తున్నారు. బీఆర్ ఎస్ నాయకులు ఇప్పటికే అనేక తాయిలాలు ప్రకటించారు. ఇస్తున్నారు.. ఇంకా ఇచ్చేందుకురెడీ అయ్యారు. అయితే.. ఈ పంపకాలుఎలా సాగాలనే విషయమే ఇప్పుడు పార్టీ నాయకుల మధ్య చర్చనీయాంశం అయింది. ఎన్నికల సంఘం కొరడా ఝళిపిస్తున్న నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించారు. మొత్తంగా ఇటు ప్రచారం.. అటు పంపకాలు కూడా సాగనున్నాయి.