పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమై ఎన్నో అంచనాలతో నిన్న లైగర్ సినిమా విడుదలైంది. విజయ్ దేవరకొండ తొలిసారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించడం, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం, కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించడంతో లైగర్ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో నటించడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై ఎనలేని ఆసక్తి ఏర్పడింది.
ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నిన్న విడుదలైంది. అయితే ఈ సినిమాకు అన్ని చోట్ల డిజాస్టర్ టాక్ వచ్చింది. సినిమా ఘోరంగా ఉందని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన రేటింగ్ ఇచ్చాడు.
సింగిల్ వర్డ్ రివ్యూ అంటూ.. అర్ధ మార్క్ రేటింగ్ ఇచ్చాడు. ఇది ఔట్ డేటెడ్ మూవీ అంటూ తేల్చేసాడు. ఈ సినిమాను తీర్చిదిద్దడానికి వచ్చిన ఎన్నో అవకాశాలను పూరి జగన్నాథ్ ఉపయోగించుకోలేక పోయారని, విజయ్ కష్టం వృధా అయిందని, అతడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు మరో మూవీని ఎంపిక చేసుకోవాలని కామెంట్స్ చేశాడు. లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తరుణ్ ఆదర్శ్ మరీ అర్ధ మార్క్ రేటింగ్ ఇవ్వడంపై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. కావాలనే ఆ సినిమాను తక్కువ చేసి చూపిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు.