పవన్ కళ్యాణ్ ఆ సినిమాను వైష్ణవ్ రీమేక్ చేస్తాడా?

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్.. ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.. తొలి సినిమాతోనే యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్నాడు. పేరుకు తొలి సినిమానే అయినా ఎంతో అనుభవం ఉన్న నటుడిలా ప్రేక్షకులను మెప్పించాడు. మొదటి సినిమాతోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టిన డెబ్యూ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ‘కొండపొలం’ నిరాశపరిచింది.

ప్రస్తతం ఈ యంగ్ హీరో నటించిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు.. ‘రొమాంటిక్’ సినిమాలో తన అందాలతో కుర్రకారు మతిపోగొట్టిన కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. గిరీశాయ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ ప బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘రంగ రంగ వైభవంగా’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తనకు ఒకే రకమైన జానర్ కథలను చేయాలని లేదన్నారు. ఏ కథ అయితే ఉత్తేజపరుస్తుందో వాటిని చేసుకుంటూ వెళ్లాలని అనుకుంటున్నానని చెప్పారు. మెగా ఫ్యామిలీలో ఎవరి సినిమా రీమేక్ చేస్తారని ప్రశ్నించగా.. మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ పెరిగానని, వారు చేసిన సినిమాలను మళ్లీ చేయాలని అనుకోవడం లేదని అన్నారు. ఒకవేళ చేయాల్సి వస్తే.. పవన్ కళ్యాణ్ నటించిన ‘బద్రి’ సినిమాను రీమేక్ చేయాలని ఉందని తన మనసులో మాటను చెప్పేశాడు.

ఇంకా తనకు దర్శకత్వం చేయడం అంటే ఇష్టమని వైష్ణవ్ తేజ్ అన్నారు. మెగా హీరోలైన ఇద్దరితో సినిమా చేయాలని ఉందని ఓపెన్ అయ్యాడు. సమయం వచ్చినప్పుడు అన్నయ్య సాయి తేజ్, బావ వరుణ్ తేజ్ లతో మల్టీ స్టారర్ సినిమా చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్నానని, సమయం వచ్చినప్పుడు మెగా ఫోన్ పడతానని చెప్పాడు. మరి భారీ అంచనాలతో వచ్చిన ‘రంగ రంగ వైభవంగా’ వైష్ణవ్ తేజ్ కెరీర్ ని ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.