తాను ఎక్కడుండేది ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్న రాజమౌళి..

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే..భారతదేశం సినిమాల్లో బెస్ట్ మూవీల్లో ఒకటిగా నిలిచింది.. అంతేకాదు అంతర్జాతీయంగా కూడా ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి.. ఈ సినిమా ఓటీటీలో వచ్చాక మరిన్ని రికార్డులు బద్దలుకొడుతోంది. ఈ ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా జీ5, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో అయితే మన దేశం నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది..

ఇక ఈ మూవీని పలువురు హాలీవుడ్ ప్రముఖులు ఓటీటీలో వీక్షించారు. ఈ సినిమా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు రాజమౌళి పనితనాన్ని కొనియాడారు. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమాకు వెస్టర్న్ కంట్రీస్ లో వచ్చిన స్పందన చూసి రాజమౌళి షాక్ అవుతున్నారు. ఇంతటి రెస్పాన్స్ అసలు ఊహించలేదని, ఆర్ఆర్ఆర్ కి ఇలాంటి ఆదరణ వస్తున్నందుకు సంతోషంగా ఉందని రాజమౌళి పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు.

సీక్రెట్ గా లొకేషన్:

దర్శకుడు రాజమౌళి టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం యూఎస్ వెళ్లిని సంగతి తెలిసిందే.. ఆయన యూఎస్ లో ఉన్నప్పటికీ ఆయన ఉండే లొకేషన్ వెల్లడించకుండా జాగ్రత్తపడుతున్నారట.. సాధారణంగా చాలా మంది మూవీ మేకర్స్ ఇలాంటి ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లినప్పుడు లొకేషన్ గురించి పబ్లిసిటీ చేస్తుంటారు. స్థానిక ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ఇలా చేస్తుంటారు.

అయితే రాజమౌళికి ఉండే క్రేజ్ వేరు.. అందుకే ఆయన తన లొకేషన్ గురించి పబ్లిసిటీ చేసుకోవడం లేదు. ఆయన లొకేషన్ తెలుస్తే ఎన్ఆర్ఐలు ఆయన్ను చూసేందుకు భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకోసం తన కచ్చితమైన లొకేషన్ ని ఆయన బయటకురాకుండా చూసుకుంటున్నారు. భద్రతా సమస్యలు రాకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అందుకే ఆర్ఆర్ఆర్ టీమ్ దీని గురించి సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం చేయలేదు..

ఆస్కార్ నామినీల జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’:

ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డుల కోసం నామినేట్ అయ్యే ఛాన్స్ ఉందని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే వెరైటీ మ్యాగజైన్ ఇప్పటికే వివిధ కేటగిరీల్లో ఆస్కార్ నామినీల ప్రాబబుల్స్ జాబితాను ప్రచురణ చేసింది. ఆ ప్రాబబుల్స్ లో ‘ఆర్ఆర్ఆర్’కు కూడా చోటు లభించింది. ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ క్యాటగిరీలో ఆర్ఆర్ఆర్ నామినేట్ అయ్యే అవకాశం ఉందని వెరైటీ మ్యాగజైన్ అంచనా వేసింది. ఉత్తమ నటుడి విభాగంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా నామినేషన్స్ లో ఉంటారని, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘దోస్తీ’ పాట నామినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేసింది..

నా కథలు దేశం దాటి వెళ్తాయని ఊహించలేదు:

టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో రాజమౌళి మాట్లాడుతూ.. తాను ఎంపిక చేసే స్టోరీలు తెలుగు దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్తాయని నమ్మకం ఉండేదని, కానీ దేశం దాటి వెళ్తాయని అస్సలు ఊహించలేదని అన్నారు. జపాన్ లో ‘బాహుబలి’కి వచ్చిన ఆదరణ చూసి.. పాశ్చాత్య దేశాల వారికి కూడా మన మూవీస్ నచ్చుతాయని అర్థమైందని తెలిపారు. వెస్ట్రన్ కంట్రీస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ‘ఆర్ఆర్ఆర్’ తీయలేదని, కానీ మూవీ రిలీజ్ అయ్యాక అక్కడి ప్రేక్షకులకు కూడా నచ్చిందని అన్నారు. హాలీవుడ్ రచయితలు, దర్శకులు, విమర్శకులు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి గొప్పగా చెబుతుంటే.. ఇవన్నీ తన గురించేనా? తన సినిమా గురించేనా? అని అనిపించిందని రాజమౌళి చెప్పారు. అయితే వారికి నా సినిమాలు నచ్చుతున్నాయి కదా అని తన ఆలోచన ధోరణి మార్చుకుని సినిమాలు చేయనని స్పష్టం చేశారు. అలా చేస్తే అది సరిగ్గా వర్కవుట్ కాదని రాజమౌళి అన్నారు.

Tags: latest news, living, rajamouli, secret place, ఎక్కడుండేది