ఆ కోరిక నెరవేరకుండానే చనిపోయిన కృష్ణంరాజు..!

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు ఈరోజు తెల్లవారు జామున కన్నుమూశారు. దాంతో సినీ ఇండస్ట్రీ మొత్తంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు 83 సంవత్సరాల వయసులో మరణించారు. అయితే చివరి రోజుల్లో కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి చూడాలని ఎంతగానో తపించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి కృష్ణంరాజు స్వయానా పెద్దనాన్న అవుతారు. అందుకే ఈ హీరో పెళ్లి కళ్ళారా చూసి సంతోష పడాలని ఆయన అనుకున్నారు. కానీ ఆ ముచ్చట తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

గతంలో మీడియా ముందుకు వచ్చిన కృష్ణంరాజు ఎన్నోసార్లు ప్రభాస్ పెళ్లి చూడాలని తనకు ఉందని అంటూ చెప్పుకొచ్చారు. ప్రభాస్‌కు మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నామని.. అతని మ్యారేజ్ న్యూస్ త్వరలోనే అనౌన్స్ చేస్తామని కూడా చెప్పేవారు. ప్రభాస్ వివాహం తన చేతుల మీదుగా జరిపితే అంతకంటే తనకు లభించే ఆనందం ఏమీ లేదని కూడా ఆయన పేర్కొన్నారు. వీలైతే ప్రభాస్ పిల్లలు అంటే తన మనవళ్లతో కలిసి నటించాలని కూడా తనకు ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టారు. కానీ ఇప్పుడు ఇవేవీ నెరవేరకుండానే కృష్ణంరాజు లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

ప్రభాస్, కృష్ణంరాజు చాలా సన్నిహితంగా మెలిగేవారు. వీరిద్దరూ కలిసి బిల్లా, రెబల్ వంటి రెండు సినిమాలతో పాటు ఇటీవల విడుదలైన రాధేశ్యామ్‌ లో కూడా నటించారు. ప్రభాస్‌కు కృష్ణంరాజు అంటే చాలా గౌరవమట. ప్రభాస్ ఆయన్ని చూస్తే చాలు వణికిపోతాడట. తన చిన్నతనంలో కృష్ణం రాజును చూసి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ప్రభాస్ అంటుంటాడు. అయితే కృష్ణంరాజు ప్రభాస్‌ పాన్ ఇండియా స్టార్ గా మారడాన్ని చూసి ఎంతో గర్వంగా సంతోషంగా ఫీలయ్యే వారు.

Tags: death, hero Prabhas, Krishnam Raju, Marriage, movie news, senior actor, tollywood hero