రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ నుంచి గెలిచిన వారికి రెండు రకాల సమస్యలు ఉంటాయి. ఒకటి ఈ నియోజకవర్గం విజయవాడ నగరంతో అనుసంధానమై ఉండగా.. మరికొంత ఉమ్మడి కృష్ణాలోని రూరల్ ప్రాంతాలతో అనుసంధానమై ఉంటుంది. దీంతో ఇక్కడి వారికి అటు విజయవాడ, ఇటు కృష్ణా జిల్లాల్లోని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా చేసిన బోడే ప్రసాద్.. ఇరు పక్షాలను సమర్థవంతంగా ముందుకు నడిపించా రు. ముఖ్యంగా బందరు రోడ్డు విస్తరణకు సంబంధించి ఆయన చేసిన కృషి .. ఇప్పటికీ.. చెప్పుకొంటారు. చిన్నా చితకా సమస్యలు పక్కన పెడితే పెనమలూరు అభివృద్ధిలో బోడే ప్రసాద్ పాత్ర మరువలేం. అయితే.. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ హవా, జగన్ పాదయాత్ర వంటివి ఇక్కడ ప్రభావం చూపించడం తో పెనమలూరు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థసారథి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన మనసు మాత్రం మంత్రి వర్గంపైనే ఉంది.
దీంతో నియోజకవర్గం సమస్యలను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం పదే పదే చెప్పగా ఏదో మొక్కుబడిగానే.. ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ కూడా ఆయన అనేక సమస్యలు స్వాగతం పలికాయి. దీంతో వాటికి సమాధానం చెప్పుకోలేక. ఇప్పుడు హైదరా బాద్‌కే ఎక్కువగా పరిమితం అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలావుంటే.. మరోవైపు.. రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన వారికి గతంలో చంద్రబాబు పరిహారం ఇచ్చారు.
అయితే.. ఎన్నికల తర్వాత.. మరింత విస్తరణ చేపట్టిన నేపథ్యంలో మరింత మంది పెండింగు నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని తాను సీరియస్‌గా తీసుకుంటున్నానని.. ప్రభుత్వం నుంచి ఇప్పిస్తానని చెప్పిన ఎమ్మెల్యే కొలుసు మాత్రం ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేక పోయారు. దీంతో ప్రజలు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. కానీ, ఆయన కనిపించడం లేదు. దీంతో ఒకరిద్దరు అసహనం వ్యక్తం చేస్తూ.. మా ఎమ్మెల్యే ఎక్కడున్నారో.. అంటూ మీడియా ముందే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పేరుకు మాత్రమే సారథి ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన కంటే కూడా ఇప్పుడు బోడే నియోజకవర్గంలో దూసుకు పోతోన్న పరిస్థితి. మాజీ మంత్రిగా పనిచేసి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా బోడే యాక్టివ్‌గా లేకపోవడం నియోజకవర్గ ప్రజలను సైతం నివ్వెరపరుస్తోంది. దీనికి తోడు రాజధాని అమరావతి వికేంద్రీకరణ ప్రభావం బలంగా ఉన్న నియోజకవర్గాలలో పెనమలూరు కూడా ఒకటి.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ నగరంలో జరిగిన భారీ అభివృద్ధి ప్రభావం పెనమలూరు ప్రభావంపై ఎక్కువుగా ఉండేది. అప్పట్లో ఇక్కడ ప్రజల జీవన స్థితిగతులు చాలా బాగుండేవి. అప్పటకి ఇప్పటకి తేడాను నియోజకవర్గంలో సాధారణ ప్రజలు కూడా స్పష్టంగా గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి మెడకు చుట్టుకోవడంతో ఈ సారి ఆయన ఎన్నికల రణక్షేత్రంలో విలవిల్లాడక తప్పని పరిస్థితి.