కొమ్మాలపాటి శ్రీధర్.- ఇప్పుడు ఈ పేరు వైసీపీ వర్గాల్లోనే ఎక్కువగా చర్చకు వస్తోంది. `ఆయనతో ఈ సారి కష్టమే గురూ`- అనే టాక్ వైసీపీ నేతల మధ్య వినిపిస్తుండడం గమనార్హం. అంతేకాదు.. వైసీపీ నాయకులు ఏ ఇద్దరుకలిసినా.. కూడా కొమ్మాలపాటి శ్రీధర్ గురించే చర్చించుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెద్దకూరపాడు నియోజకవర్గం నుంచి 2009, 2014లో వరుస విజయాలు దక్కించుకున్న కొమ్మా లపాటి.. గత ఎన్నికల్లో హ్యాట్రిక్ మిస్ అయ్యారు.
ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన నంబూరి శంకర్రావు విజయం దక్కించుకున్నారు. అయితే.. అత్యంత తక్కువ సమయంలో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. కనీసం..ఇక్కడ రోడ్లు వేయించడంలోకానీ.. సాగు, తాగు నీటిని అందించడంలో కానీ.. ఆయన ఎలాంటి శ్రద్ధ చూపించకపోగా.. సొంత పార్టీ నాయకులపైనే ఆయన కేసులు పెట్టించారు. తనను ప్రశ్నించిన వారిని జైళ్లకు పంపించారు. నిజానికి ఏ ఎమ్మెల్యేనైనా ఎందుకు ఎన్నుకుంటారు? అభివృద్ధి కోసం.
కానీ, ఇక్కడ నంబూరు మాత్రం.. తన అభివద్ధి మాత్రమే చూసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కేడర్ సహా.. నాయకులు కూడా నంబూరుకు వ్యతిరేకంగా ఉన్నారు. మరోవైపు ప్రజలు కూడా తమకు ఏ సమస్య వచ్చినా.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి కార్యాలయానికి వెళ్తున్నారు. ఇక్కడ ఇంకో చిత్రం కూడా ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన నంబూరు తన కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేసి.. ఇక్కడ మాత్రం నామ్ కేవాస్తే.. అన్నట్టు ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు.
ఆయన మాత్రం గుంటూరులోనే ఉంటున్నారు. కానీ, కొమ్మాలపాటి మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఏ సమస్య వచ్చినా స్పందిస్తున్నారు. నేనున్నానంటూ.. ఆయన ప్రజలకు భరోసా ఇస్తు న్నారు. గత రెండేళ్లుగా ఒకటి రెండు రోజులు మినహాయిస్తే నియోజకవర్గంలో కొమ్మాలపాటి పర్యటించని.. తిరగని రోజు అంటూ లేదు. దీంతో నంబూరి మాటే ఎక్కడా వినిపించడం లేదు. అక్రమాలు, ఇసుక దోపిడీ, సొంత నేతలను కూడా దూరం పెట్టారని, వారిపైనే కేసులు పెట్టారని.. వంటి విషయాల్లో మాత్రం ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో కొమ్మాలపాటితో ఈ సారి కూరపాడు వైసీపీకి కష్టమేనని వైసీపీ నాయకులే అంటుండడం గమనార్హం.