తెలుగుదేశం పార్టీలో ఈసారి కొంతమంది సీనియర్లకు షాకులు తప్పేలా లేవు. ఈ క్రమంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ నుంచి 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా యువనేత భాష్యం ప్రవీణ్ పోటీ చేయటం దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు చిలకలూరిపేట పేరు చెప్పితే ప్రత్తిపాటి పుల్లారావు మాత్రమే గుర్తుకు వస్తారు. 1999 నుంచి 2019 వరకు వరుసగా 5 ఎన్నికలలో పోటీ చేసిన ఆయన మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నిక కావడంతో పాటు మంత్రిగా కూడా పనిచేశారు.
అయితే మారుతున్న రాజకీయ పరిస్థితులు.. పార్టీలో కొత్త తరాన్ని ఎంకరేజ్ చేసే క్రమంలో భాగంగా ఈసారి చిలకలూరిపేట టిక్కెట్ భాష్యం ప్రవీణ్‌కే దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భాష్యం ప్రవీణ్ రాజకీయాలకు కొత్త అయినా కరోనా టైం నుంచి కూడా పార్టీ కోసం ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. ఈరోజు ప్రవీణ్ పేరు చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ రేసులో వినిపిస్తున్నా గత రెండున్నర సంవత్సరాల నుంచి కేవలం చిలకలూరిపేటలో మాత్రమే కాదు.. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ తరఫున విస్తృతంగా ఖర్చు చేస్తూ వస్తున్నారు.
జిల్లాలో చంద్రబాబు పర్యటనల సమయంలో కూడా తన వంతుగా ఏర్పాట్లు చేస్తూ హైలైట్ గా నిలిచారు. గుంటూరు నగరంలోని రెండు నియోజకవర్గాలతో పాటు.. ప్రతిపాడు, తాడికొండ, మాచర్ల లాంటి నియోజకవర్గాల్లోనూ పార్టీ కోసం నిధులు వెచ్చించారు. ఇక ఇటు చిలకలూరిపేట లోను పార్టీ కేడర్‌కు అండగా ఉంటూ వస్తున్నారు. ప్రవీణ్ తన నియోజకవర్గంలో దూకుడుగా వెళుతుండడంతో పాటు పార్టీ కేడర్ ప్రశంసలు అందుకుంటూ ఉండడంతో పుల్లారావు సైతం ఉలిక్కిపడ్డారు. దీంతో ఆయన సైతం ప్రవీణ్‌ను ఉద్దేశించి ఇలాంటోళ్లు ఎన్నికల టైంలోనే వస్తారు… పోతుంటారు.. ఈ నాలుగేళ్లు ఎక్కడ ఉన్నాడంటూ ఘాటుగానే స్పందించారు.
అక్కడితో ఆగకుండా అధిష్టానం సైతం వీళ్లను ఎంకరేజ్ చేస్తోందన్న కారణంతో కోడెల వారసుడు శివారంను పక్కన పెట్టడంతో అతడికి కూడా న్యాయం జరగాలన్నట్టుగా మాట్లాడారు. అయితే ఇదే టైంలో ప్రవీణ్‌కు యువనేత లోకేష్ అండదండలు గట్టిగా ఉన్నాయని రాష్ట్ర స్థాయిలో గట్టిగా టాక్ నడుస్తోంది. కొందరు పుల్లారావు తన అనుచరులను లోకేష్‌కు దగ్గరకు పంపి ఇదే విషయమై అడిగించారని అప్పుడు ఆయన ఈ నాలుగేళ్లు ఎక్కడ ఉన్నారు.. పార్టీ కోసం ఏం చేశారని సూటిగా ప్రశ్నించడంతో ఆ వెళ్లిన నాయకులు కూడా నోరు మెదిపి ఏం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందట.
ఇటు విడదల రజనీ లాంటి మంత్రిని ఢీ కొట్టాలంటే యువతరంతో సాధ్యమవుతుందని.. అందులోనూ ప్రవీణ్ లాంటి క్లీన్ ఇమేజ్ వ్యక్తికి ఇక్కడ సీటు ఇస్తే కొన్నేళ్ల పాటు ఇక్కడ పార్టీ విషయంలో తిరిగి చూసుకునే పనే ఉండదని లోకేష్ గట్టిగా డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. త్వరలోనే చిలకలూరిపేట ఇన్‌చార్జ్ పదవిపై క్లారిటీ రానుందని పార్టీ వర్గాల టాక్ ?