టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ‘ది ఘోస్ట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 5న దసరా పండుగ సందర్భంగా మూవీ యూనిట్ రిలీజ్ చేస్తోంది. మరో వారం రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా రన్ టైమ్‌కు సంబంధించిన ఓ కీలక విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రన్ టైమ్ ఒక గంట 35 నిముషాల మాత్రమే ఉంటుందట. అంటే ఎంత తక్కువ సమయమో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో పుష్ప, ఆర్ఆర్ఆర్, సీతా రామం, బింబిసార, కార్తికేయ 2 వంటి సినిమాలన్నీ కూడా రెండున్నర గంటలకు పైగానే ఉన్నాయి. కానీ నాగార్జున మాత్రం కొత్త వారిలాగా చాలా తక్కువ నిడివితో తన మూవీని తీసుకొస్తున్నాడు.
ఈ రన్‌టైమ్ మాత్రమే కాదు మూవీ కథ కూడా ఒక హాలీవుడ్ స్టోరీలాగా ఉంటుందట. తల్లీకూతుర్లను కాపాడే ప్రయత్నంలో నాగార్జున ఎదుర్కొనే ఛాలెంజ్‌లే ఈ సినిమా కథాంశం అని అంటున్నారు. నాగార్జున చేసిన ఇంటెన్స్ ఫైట్స్ ఈ సినిమాలో హైలెట్ కానున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ది ఘోస్ట్ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు,శరత్ మారార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం అందించారు.
ఘోస్ట్ సినిమాలో నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా అలరించనున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి గుల్ పనాగ్, అనిఖా సురేంద్ర కీలకమైన పాత్రలో నటించారు. నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమా కరోనా కారణంగా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. కానీ నాగార్జున నటనకు ఆ సినిమాలో మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ మన్మధుడు ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకులను పండగరోజు అలరించబోతున్నాడు.