‘విశాఖ నుంచే జగన్మోహన్ రెడ్డి పతనం’

ఏపీలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా హిటెక్కాయి. ఒకపక్క నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, మరో పక్క అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీని వీడి అనేక మంది సీనియర్ నేతలు వైసీపీలో చేరుతున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి జగన్ పై విరుచుకు పడ్డారు. గతంలోనూ ఆయన పలుమార్లు ఇలాగే ఆరోపణలకు దిగారు. ట్విట్టర్ వేదికగా వ్యంగాస్ర్తాలను కూడా సంధించారు. తాజాగా మరోసారి మీడియా ఎదుట ఆయన విరుచుకు పడ్డారు. జగన్ పతనం విశాఖ నుంచే ఆరంభం అవుతుందని జోస్యం చెప్పారు.

ఇంకా ఏమన్నారంటే.. ఏపీ సీఎం జగన్ తన స్వార్థం కోసం మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు నాని. కేసులకు భయపడి బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని.. కేంద్రం మెడలు వంచుతానని చెప్పి కాళ్లు పట్టుకుటున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలతోనే జగన్ పతనం మొదలవుతుందన్నారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ పీఠంతో పాటు విజయవాడ కార్పొరేషన్ గెలుస్తున్నామని ధీమావ్యక్తం చేశారు టీడీపీ ఎంపీ. 75 శాతం సీట్లు గెలవబోతున్నామన్న ఆయన.. జగన్ ఎంత మంది మంత్రులతో రాజీనామా చేయిస్తారో చూద్దామని సవాల్ విసిరారు. కృష్ణా గుంటూరు జిల్లాలు నాశనం అవ్వాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. చివరగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్‌లను టీడీపీ కైవసం చేసుకుంటుందని ధ్వజమెత్తారు.

Tags: AP, comments, Kesineni Nani, tdp, YS Jagan, ysrcp