ఏపీ సీఎం జగన్ సొంత జిల్లాలో అప్పట్లో కాంగ్రెస్.. ఆ తర్వాత వైసిపి తప్ప మరో పార్టీకి ఎప్పుడు స్కోప్ లేకుండా పోతుంది. 2004 సాధారణ ఎన్నికల నుంచి అసలు తెలుగుదేశం అక్కడ ఒక సీటు గెలవటమే గగనం అవుతుంది. 2004లో కమలాపురం – 2009లో ప్రొద్దుటూరు – 2014లో రాజంపేట సీటుతో సరిపెట్టుకున్న తెలుగుదేశం 2019 ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేదు. దీనిని బట్టి కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీ హవా ఎంత ? బలంగా కొనసాగుతుందో తెలుస్తోంది.
గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో అయితే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు.. సానుభూతిపరులు అసలు నామినేషన్ వేయటం కూడా కష్టం అవుతుంది. కొన్నిచోట్ల బెదిరింపులు, దౌర్జన్యాలతో కూడా టిడిపి అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అధికార పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారు. అలాంటి చోట తాజాగా గ్రామపంచాయతీ ఉప ఎన్నికల్లో వైసీపీకి మాడు పగిలిపోయేలా ఓటరు తీర్పు ఇచ్చారు.
ఇక్కడ ఐదు వార్డులకు ఎన్నికలు జరిగితే మూడు టీడీపీ మద్దతుదారులు విజయం సాధించడం అంటే అది మామూలు సంచలనం కాదని చెప్పాలి. సిద్దవటం మండలంలోని మాధవరం 1లో రెండో వార్డుకు జరిగిన ఎన్నికలలో టిడిపి అభ్యర్థి భాగ్యలక్ష్మి 26 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇదే మండలంలోని ఉప్పరపల్లె పంచాయితీ పదవ వార్డులో టిడిపి బలపరిచిన అభ్యర్థి లక్ష్మీ లీల 13 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
రాజుపాలెం పంచాయతీలోని తొమ్మిదవ వార్డుకు జరిగిన ఎన్నికలలో టిడిపి బలపరిచిన ఓబులేసు 42 వాట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లె 13వ వార్డు ఉప ఎన్నికలలో వైసిపి రెబల్ అభ్యర్థి.. టిడిపి బలపరిచిన హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి బలపరిచిన బ్రహ్మానందరెడ్డి పై 48 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఈ ఎన్నికను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడ ఓటుకు ఐదువేలతో పాటు బంగారు గొలుసులు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఏది ఏమైనా ఇక్కడ ఐదు వార్డులకు ఉప ఎన్నికలు జరిగితే కేవలం ఒక్కచోట మాత్రమే వైసీపీ విజయం సాధించగా.. మరోచోట టిడిపి బలపరిచిన వైసిపి రెబల్ అభ్యర్థి గెలిచారు అంటే దీనిని బట్టి జిల్లాలో పల్లెల్లో వైసిపి పై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.