ఎన్టీఆర్ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం జగ్గయ్యపేట. ఇక్కడ ఒకప్పుడు కాంగ్రెస్ బలంగా ఉండేది. తర్వాత కాలంలో టీడీపీ పుంజుకుని.. కాంగ్రెస్ ఓటు బ్యాంకును కూడా తనవైపు తిప్పుకొని అప్రతిహత విజయం అందుకున్న రికార్డును సృష్టించింది. అయితే.. గత 2019 ఎన్నికల్లో సీనియర్‌నాయకుడు సామినేని ఉదయభాను..ఇ క్కడ నుంచి విజయం దక్కించుకున్నారు. టీడీపీ తరఫున పోటీ చేసిన శ్రీరాం తాతయ్య స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు.
అయితే.. వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడ విజయం దక్కించుకోవాలన్న వైసీపీ లక్ష్యం నెరవేరేలా కనిపించ డం లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. సామినేని ఉదయభాను వ్యక్తిగత గ్రాఫ్ ఎప్పుడో పడిపోయిందనే విషయాన్ని వైసీపీ కూడా గుర్తించిందని అంటున్నారు. గతంలో ఆయనకు ఒకింత ఇమేజ్ ఉంది. అయితే.. ఉదయభాను కుమారులు.. హైదరాబాద్‌లో ఒక కీలక కేసులో పట్టుబడడం.. టోల్‌గేట్ సిబ్బందితో గొడవ పడడం వంటివి ఆయన ఇమేజ్‌ను తగ్గించాయి.
ఇక, తనకు మంత్రి పీఠం దక్కలేదన్న బాధతో.. ఆయన ప్రజల మద్యకు రాలేక పోతున్నారు. అంతేకా దు.. పార్టీ కేడర్‌ను కూడా సామినేని పట్టించుకోవడం లేదు. నియోజకవర్గంలో ఎప్పటి నుంచో డిమాండ్‌గా ఉన్న డంపింగ్ యార్డ్ వ్యవహారాన్ని పరిష్కరిస్తానని ఎన్నికలకు ముందు ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పటికీ ఈ సమస్య కొనసాగుతోంది. దీనికి తోడు నియోజకవర్గంలోనూ ఆయన అందుబాటులో ఉండడం లేదనే టాక్ వినిపిస్తోంది.
కట్ చేస్తే.. కొన్ని నియోజకవర్గాల్లో సాగుతున్న విధానం మాదిరిగానే ఇక్కడ కూడా ప్రజలు తమ సమస్య చెప్పుకొనేందుకు మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఇంటికే వెళ్తున్నారు. ఆయన కూడా సమస్యల పరిష్కారంపై తన వంతు కృషి చేస్తున్నారు. ఇక్కడ ఇంకో చిత్రం ఏంటంటే.. ఇతర నియోజకవర్గాల్లో మాదిరిగా.. సవాళ్లు ప్రతిసవాళ్లు లేవు. కేవలం శ్రీరాం తాతయ్య తన పనితీరుతో ముందుకు సాగుతున్నారు. వివాద రహితంగానే ఆయన ప్రజల మధ్య తిరుగుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలలో ఆయన గెలుపు రాసిపెట్టుకోవచ్చని పార్టీ నాయకులు భావిస్తున్నారు.