ద‌స‌రాకు విశాఖ నుంచే జ‌గ‌న్ పాల‌న‌… ఒక‌టో సారి.. రెండోసారి.. ప‌దో సారీ..!

విజయదశమి పండుగ నుంచి విశాఖ రాజధాని కేంద్రంగా పరిపాలన చేస్తానని ముఖ్యమంత్రి జగన్ మరోసారి తన క్యాబినెట్ స‌హ‌చ‌రుల‌కు చెప్పిన సంగతి తెలిసిందే. దసరా నుంచి విశాఖపట్నం పాలన ఉంటుందని.. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని జగన్ మరోసారి చెప్పారు. విశాఖలో ఋషికొండ మీద ఇప్పటికే సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తున్నారు. అయితే ఇది సీఎం జగన్ కోసం అని ఇప్పటివరకు ప్రకటించలేదు. ఆ క్యాంప్ ఆఫీస్ నిర్మాణంపై కోర్టులో కేసులు ఉన్నాయి. అవి టూరిజం భవనాల నిర్మాణమని అధికారులు చెబుతున్నారు.

ఇక గత మూడేళ్ల నుంచి కూడా దసరా నుంచి విశాఖ రాజధానిగా పాలన మొదలవుతుందని ముఖ్యమంత్రి జగన్ చెబుతూ వస్తున్నారు. అటు మంత్రులు కూడా అదే మాట చెబుతున్నారు. కానీ విశాఖ రాజధాని మాత్రం కావడం లేదు. మూడేళ్ల నుంచి ఇదే మాట చెబుతున్నారు. ఈ క్రమంలోనే మరోసారి జగన్ నోట విశాఖ రాజధాని.. అక్కడ నుంచే పాలన అన్న మాట వచ్చింది. అయితే ఇదంతా జరిగే పని కాదు అన్నది సాధారణ ప్రజలకు కూడా క్లారిటీ వచ్చేసింది.

డిసెంబర్లో అమరావతి కేసులు విచారణ సుప్రీంకోర్టులో జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని కాకుండా సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ అని బోర్డు పెట్టుకునే అవకాశం ఉంది. ఆఫీసులు మాత్రం విశాఖకు తరలించే అవకాశం లేదని సమాచారం. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు. ఇప్పటికే తాడేపల్లి ఇంటి కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించారు.

ఎదురుగా ఉన్న కాలనీని సైతం ఖాళీ చేయించారు. పక్కనే ఉన్న అమరారెడ్డి నగర్ అనే కాలనీ కూడా ఖాళీ చేయిస్తారని ప్రచారం ఉంది. అయితే జగన్ రెడ్డి మాత్రం తాను విశాఖ వెళుతున్నానని చెబుతున్నారు. అసలు విశాఖ రాజధాని అన్న విషయంలో ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. మరోసారి జగన్ మాట సారి అనుకోవాల్సిందేమో.