జ‌గ‌న్ బైబై… చంద్ర‌బాబు చెంత‌కు వైసీపీ టాప్ లేడీ లీడ‌ర్‌…?

వచ్చే సర్వత్రిక ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ ఏపీలో అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తుంది. వైసీపీ ఆ పార్టీ మహిళనేత మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆమె వైసీపీ అధిష్టానంతో పాటు జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కిల్లి కృపారాణి కాంగ్రెస్ నుంచి 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించి తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. 2014లో సైతం కృపారాణి కాంగ్రెస్ నుంచి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసిపిలో చేరిన ఆమె ఎంపీ సీటు ఆశించారు. అయితే జగన్ ఆ సీటును దువ్వాడ శ్రీనివాస్ కేటాయించడంతో దువ్వాడ గెలుపు కోసం కృపారాణి కష్టపడి పనిచేశారు. ఇక వైసిపి అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కృపారానికి రాజ్యసభ సీటు వస్తుందన్న ప్రచారం కూడా గట్టిగా జరిగింది. కనీసం టెక్కలి లేదా నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తుందని కూడా ఆమె ఎదురుచూపులు చూస్తూ వస్తున్నారు.

ఆమె ఆశ‌లు నెర‌వేరేలా లేకపోవడంతో ఇప్పుడు ఆమె టిడిపిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ సీటును జిల్లాకే చెందిన డాక్టర్ దానేటి శ్రీధర్ కి ఇప్పించాలని ధర్మాన సోదరులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట నుంచి అసెంబ్లీ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది.

అదే జరిగితే శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి తాను పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందన్న ఆశలతోనే ఆమె టిడిపి వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరేందుకు జిల్లాకు చెందిన ఆ పార్టీ కేలక నేతలతో మంతనాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.