ఓన్లీ వ‌ర్క్ ఫ్రం హోమ్ సీఎంగా జ‌గ‌న్‌… !

వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది. మరో ఆరు ఏడు నెలల్లో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అయితే జగన్ పాలన అంతా తాడేపల్లి నివాసంలోని ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచే కొనసాగిస్తున్నారు. దీంతో జగన్‌ది ఇంటి పాలనగా మారిపోయిందా ? అన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. క్యాబినెట్ సమావేశాలు ఉన్నప్పుడు తప్ప సీఎం జగన్ అసలు సచివాలయం వైపు చూడటం లేదు.

ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగన్ ఎప్పుడు రాజధానిలో ప్రజలను కలుసుకున్న దాఖలాలు కూడా లేవు. వివిధ కార్యక్రమాలు.. బటన్ నొక్కి మీటింగ్లు సమయంలో తప్ప తాడేపల్లి ఫ్యాలెస్‌ నుంచి ఆయన బయటకు రావటం లేదు. ఇప్పటికే తెలుగుదేశం వర్గాలు ఆయనను తాడేపల్లి పిల్లి అని తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పోనీ జగన్ తాడేపల్లి నివాసం నుంచి సెక్రటేరియట్ కు ఏమైనా పెద్ద దూరం ఉంటుందా.. అంటే పది కిలోమీటర్లు కూడా ఉండదు.

అయినా సరే సీఎం జగన్ ఇల్లు దాటి బయటికి రావటం లేదు. దీంతో శాఖల సమీక్షలు కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీసులోనే జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ సచివాలయానికి రాకపోవడంతో మంత్రులు, ఐఏఎస్ లకు కూడా ఇష్టారాజ్యం అయిపోయిందన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి ఉండనే ఉన్నాయి. ఇక జగన్ కూడా సచివాలయం వైపు కన్నెత్తి చూడకపోవడంతో కొంతమంది… ఐఏఎస్‌లు కూడా ఇళ్ల‌ దగ్గర నుంచి పనులు కానిస్తున్నారు అన్న గుసగుసలు ఉన్నాయి.

ఇక మంత్రులది అదే తీరుగా ఉందంటున్నారు. స్వయంగా సీఎం పేషీలోని అధికారుల డిజిటల్ సిగ్నేచర్లను కొంతమంది ఉద్యోగులు దుర్వినియోగం చేసిన సంగతి తెలిసిందే. ఇది పరిపాలన వైఫల్యానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అన్న విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా జగన్ గ‌త‌ నాలుగున్నర సంవత్సరాల పాలన అంతా తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసు నుంచే ముగించి పడేశారు అన్న విషయం ఏపీలోని సామాన్య జనాల్లోకి కూడా బలంగా వెళ్లిపోయింది.