టీడీపీలో భార్య‌, భ‌ర్త‌ల జాక్‌పాట్‌.. ఒక‌రికి ఎంపీ… ఒక‌రికి ఎమ్మెల్యే సీట్లు..!

ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న అంచనాల వేళ‌ ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఇలాంటి పోటీ నేపథ్యంలో భార్య భర్తలు ఇద్దరూ తెలుగుదేశం ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు దక్కించుకుంటున్నారు. వారిద్దరు ఎవరో కాదు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి.. ఆయన భార్య మాధవి రెడ్డి కావ‌టం విశేషం.

తాజాగా మాధవి రెడ్డిని కడప అసెంబ్లీ ఇన్చార్జిగా పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. ఇక శ్రీనివాసరెడ్డికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి ఆర్ రాజగోపాల్ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. కడప జిల్లాలో వైఎస్ కుటుంబం వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి రాజకీయం చేశారు. గతంలో టిడిపి తరఫున శ్రీనివాస్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేశారు.

మరోసారి కూడా ఆయన అవినాష్ రెడ్డి పై పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన భార్య మాధవికి కడప అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబుపై ఆయన ఒత్తిడి తెచ్చారు. అటు వైసిపి నుంచి అంజాద్ బాషా రెండుసార్లు విజయం సాధించగా మూడోసారి పోటీకి రెడీ అవుతున్నారు. ఏది ఏమైనా ఈసారి అంజాద్ – మాధవి రెడ్డి మధ్య గట్టి పోటీ ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీలో భార్యాభర్తలు ఇద్దరు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు దక్కించుకుని చాలా లక్కీ పర్సన్స్ అయ్యారు. రేపటి ఎన్నికల వీరిద్దరూ విజయం సాధిస్తే సంచలనం నమోదు అయినట్టే..!