వైసీపీలో ఉండి.. టీడీపీ విజ‌యం కోరుకుంటోన్న పేర్ని నాని… ఇది నిజం…!

మాజీ మంత్రి, మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే పేర్నినాని తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వైసీపీలో ఉన్న పేర్ని టీడీపీ గెల‌వాల‌ని కోరుకుంటున్నారు. అది కూడా కీల‌క‌మైన ఓ స్థానంలో గెలవాల‌ని ఆయ‌న ఆశిస్తున్నారు. అంటే.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ చెబుతున్న `వైనాట్ 175` బ‌దులుగా మాజీ మంత్రి పేర్ని.. 174 మాత్ర‌మే కోరుకుంటున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నిజానికివైసీపీలో ఉన్న ఎవ‌రిని ప‌ల‌కరించినా.. తామే గెల‌వాల‌ని.. కోరుకుంటారు. అదే చెబుతారు. సీఎం జ‌గ‌న్ కూడా అదేనిర్దేశించారు.

అలాంటిది పేర్ని మాత్రం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో `ఆ ఒక్క‌టి త‌ప్ప‌!` అనే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అదే.. ఉమ్మ‌డి అనంత‌పురంలోని ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ప‌య్యావుల కేశవ్ ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో ఆయ‌న కూడా స‌భ‌కు వ‌చ్చారు. అయితే.. ఈ సంద‌ర్భంగా పేర్ని-ప‌య్యావుల ఎదురు ప‌డ్డారు. స‌హ‌జంగా టీడీపీ-వైసీపీ నేత‌ల‌కు ఒక‌రంటే ఒక‌రికి ఏమాత్రం ప‌డ‌దుక‌దా! అయితే.. ఇక్క‌డ‌కూడా అంతే..!

కానీ, ఇక్క‌డ పేర్ని..పుల్ల‌విరుపు మాట‌ల‌తో ప‌య్యావుల‌ను ఉడికించారు. అదేస‌మ‌యంలో వైసీపీలోనూ చ‌ర్చ‌గా మారారు. “వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ మీరు గెల‌వాల‌ని కోరుకుంటున్నా“ అని ప‌య్యావుల‌ను ఉద్దేశించి పేర్ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మీ గెలుపుకోసం.. నేనుప్రార్థిస్తాను అన్నారు. దీంతో ప‌క్క‌నే ఉన్న వైసీపీ నేత‌లు ఒకింత ఆశ్చ‌ర్యం.. విస్మ‌యం కూడా వ్య‌క్తం చేశారు. ఎందుకంటే.. రాష్ట్రంలో మొత్తం మ‌న‌మే గెల‌వాల‌ని పార్టీ అదినేత ప‌దే ప‌దే చెబుతున్న నేప‌థ్యంలో పేర్ని ఇలా ఉవ‌చించారేంటా? అని ఆశ్చ‌ర్య‌పోయారు.

అయితే.. దీనికి స‌మాధానంగా ప‌య్యావుల వెంట‌నే “అవును గెలుస్తాం.. 1995 నాటి సీన్ రిపీట్ చేస్తాం“ అని స‌మాధానం ఇచ్చారు. అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గానికి ఒక సెంటిమెంటు ఉంది. ఇక్క‌డ గెలిచిన నేత తాలూకు పార్టీ అధికారంలోకి రాదు. గ‌త మూడు ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. అదే జ‌రిగింది.2004, 2009లో ప‌య్యావుల టీడీపీ నుంచి గెలిచారు. పార్టీ అధికారం కోల్పోయింది. 2014లో ఓడిపోయారు.. వైసీపీ గెలిచింది. అయితే.. టీడీపీ అదికారంలోకి వ‌చ్చింది. ఇక‌, 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచింది. మ‌ళ్లీ అధికారం కోల్పోయింది. బ‌హుశ ఈ సెంటిమెంటును దృష్టిలో ఉంచుకునే పేర్ని ఇలావ్యాఖ్యానించి ఉంటార‌ని అంటున్నారు.

Tags: intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, tdp chandrababu, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp