రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం ఏర్పాట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అధికార పార్టీ వైసిపి ఇప్పటికే ఎన్నికల కోసం ప్రచారాన్ని మొదలుపెట్టిందని చెప్పవచ్చు. కానీ టిడిపి జనసేన పొత్తు నేపథ్యంలో సీట్ల సర్దుబాటు, ఇరు పార్టీ నేతల మధ్య సమన్వయంతో ఇంకా ప్రచారాన్ని టిడిపి మొదలుపెట్టలేదని తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో టిడిపి ఎన్నికలకు సన్నద్ధం అవ్వడానికి కొంత సమయం తీసుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయటకు వచ్చిన తరువాత తన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈసారి కచ్చితంగా జనసేనతో కలిపి 155 సీట్లు గెలవాలని బాబు చెబుతుంటే, అందులో కచ్చితంగా 125 స్థానాలలో టిడిపి జెండా ఎగరాలని, అందుకు కావలసిన ప్రణాళికలను సిద్ధం చేశారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
అందుకోసం 125 స్థానాలలో టిడిపి జెండా పాతడానికి కావలసిన ప్రణాళికలను బాబు సిద్ధం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందులో మొదటిది ఓట్ల షేరింగ్. జనసేన టిడిపి పొత్తు నేపథ్యంలో ఏ నియోజకవర్గం లో ఏ అభ్యర్థిని నిలబెడితే ఓట్లు తమకు అనుకూలంగా పడతాయో బాబు వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు చాణిక్యనీతిని వైసిపి వారి చాలా సార్లు మెచ్చుకున్నారు. అందుకే ఆయనకు భయపడి ఎన్నికలకు ముందే ఆయనను అక్రమంగా అరెస్టు చేసి టిడిపిని దెబ్బ కొట్టాలని ప్రయత్నాలు చేశారు.
తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లు బెయిలు పై చంద్రబాబు బయటకు వచ్చి వైసీపీకి షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో టిడిపికి కంచుకోట లాంటి నియోజకవర్గాలు 58 నుంచి 60 వరకు ఉన్నాయి. వాటిలో గత ఎన్నికల్లో సంస్థగత పొరపాట్లు, అభ్యర్థుల ఎంపిక, క్యాడర్ ను కట్టుకోలేకపోవడం వంటి లోపాల వల్ల టిడిపి చేజార్చుకుంది. కానీ ఈసారి అటువంటి పొరపాట్లు జరగకుండా చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తుని, పెనుగొండ, పాయకారావుపేట, పలాస మొదలైన నియోజకవర్గాలు టిడిపికి కంచుకోటలు.
టిడిపి స్థాపించిన దగ్గర నుంచి పది సార్లు ఎన్నికలు జరిగితే ఇక్కడ కచ్చితంగా 7 సార్లు టిడిపి విజయం సాధించింది. కానీ అలాంటి వాటిల్లో 2019లో పరాజయాన్ని చవి చూడవలసి వచ్చింది. అందుకే చంద్రబాబునాయుడు ఈసారి ఆ కంచుకోటలపై తన ప్రత్యేక దృష్టిని పెట్టి ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు వ్యూహాలు ఫలించి టిడిపి కంచుకోటలో ఈసారి టిడిపి జెండా ఎగిరితే, రాష్ట్రంలో టిడిపి విజయాన్ని ఆపే వారెవరు ఉండరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.