ఏపీ రాజకీయాలలో సంచలన సంఘటన చోటుచేసుకుంది. ఏనాడు కోర్టుమెట్ల ఎక్కని నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏకంగా రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. నిజంగా ఇది టిడిపికి పెద్ద షాకింగ్ పరిణామం. చంద్రబాబు అరెస్టుపై ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటి మీదకు వచ్చి ఖండిస్తున్నాయి. సిపిఐ నారాయణ, సిపిఎం రామకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తో పాటు తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలు సైతం చంద్రబాబును అరెస్టు చేసిన తీరు సరికాదని చెబుతున్నారు.
ఇక చంద్రబాబు అరెస్టు వార్త విన్న వెంటనే నందమూరి ఫ్యామిలీ అంతా విజయవాడ వచ్చింది. బాలయ్య, బ్రాహ్మణి. బాబు సతీమణి నారా భువనేశ్వరి పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ అంతా కూడా వచ్చి బాబుని పరామర్శించారు. ఇక సినీ ప్రముఖులు.. వివిధ రంగాల ప్రముఖుల నుంచి కూడా మద్దతు బాబుకి దక్కింది. అయితే ఎన్టీఆర్ మేనల్లుడు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎపిసోడ్లో అస్సలు స్పందించకపోవడం ఆశ్చర్యకరం.
జూనియర్ తన మామయ్య అయిన చంద్రబాబు అరెస్టు మీద కనీసం స్పందించలేదు. అటు సోషల్ మీడియాలోనూ కామెంట్ కూడా చేయలేదు. గతంలో ఎన్టీఆర్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేలా వల్లభనేని వంశీ మాట్లాడినప్పుడు.. తన మేనత్త భువనేశ్వరిని దారుణంగా కామెంట్ చేసినప్పుడు ఎన్టీఆర్ పెట్టిన కామెంట్ కూడా ఏదో మొక్కుబడిగా ఉన్నట్టుగా ఉండే తప్ప మనస్పూర్తిగా పెట్టినట్టు లేదు.
ఇక ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ అస్సలు స్పందించకపోవడం.. కేవలం తెలుగుదేశం పార్టీ అభిమానులనే కాదు నారా, నందమూరి అభిమానులతో పాటు సగటు ప్రజలను కూడా కాస్త బాధ పెట్టేలా ఉందన్న చర్చలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఎన్టీఆర్ స్పందించాలనుకుంటే ఇప్పటికే స్పందించేవాడు.. అతడు మనసులో అలాంటి ఉద్దేశం లేనందునే ఈ విషయంపై అసలు నోరు మెదపడం లేదని అంటున్నారు.