అవును నిజమే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది ఐటీ శాఖ వ్యవహారం. ఇప్పుడంతా అదే చర్చించుకుంటున్నారు. మాజీ సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ఇళ్లపై ఐటీ అధికారులు వారం రోజులుగా ఏకబిగిన సోదాలను నిర్వహించారు. ఆయనకు సంబంధించిన బంధులను కూడా వదిలిపెట్టలేదు. దీనిపై పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా వార్తలు వెలువడ్డాయి. రూ. 2 వేల కోట్లు దొరికియాని పుకార్లు షికారు చేశాయి. అదీగాక పలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు ప్రచారం సాగింది. ఏకంగా చంద్రబాబే బుక్కయ్యాడు అన్నంతగా భ్రమ కల్పించేలా వార్తలు ప్రచురితమయ్యాయి.
ఇదిలా ఉండగా.. తాజాగా ఐటీ శాఖ విడుదల చేసిన పంచనామా నివిదేకను పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ అవాక్కవ్వాల్సిందే. ఆ తనిఖీల్లో రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించడం గమనార్హం. అదీగాక రూ.2 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఐటీ పంచనామా నివేదిక స్పష్టం చేసింది. దీనిపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని ఐటీ తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు దీనిపై ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ, అధికార పార్టీ వైసీపీ నేతలు పరస్పరం విమర్శలు చేకుంటున్నారు.