ప్ర‌కాశం వైసీపీలో రెండు బిగ్ వికెట్లు డౌన్‌… ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు జంపే…!

ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. అధికార వైసిపి ప్రతిపక్ష, టిడిపి రెండు కూడా గెలుపే లక్ష్యంగా ఎత్తులకు పై ఎత్తులతో దూకుడుగా ప్రజల్లోకి వెళుతున్నాయి. ఓవైపు అభ్యర్థులను కూడా ఫైనల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇతర పార్టీలో ఉన్న కీలక నేతలపై ఆపరేషన్ ఆకర్ష్‌ కూడా నడుస్తుంది. విచిత్రం ఏంటంటే వైసిపి.. టిడిపిలో అవకాశం లేని నేతలు జనసేన వైపు కూడా చూస్తున్నారు. ఇక అధికార వైసిపి నుంచి కొందరు కీలక నేతలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు.

ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు కూడా ఆ పార్టీని వీడినట్టే. ఇప్పుడు ప్రకాశం జిల్లా వంతు వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటారా ? బయటకు వస్తారా అన్నదానిపై ఆ ఇద్దరు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రశ్నలు త‌లెత్తుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్‌ టాపిక్ గా మారింది. ఆ ఇద్దరి ఎమ్మెల్యేలు ఎవరో కాదు కందుకూరు ఎమ్మెల్యే మాజీమంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి, మరొకరు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్.

వాస్తవానికి మహిదర్ రెడ్డి జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి ఆశించారు. ఆయన సీనియర్ రాజకీయ నేత.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తన సీనియార్టీ కి తగిన పదవి లభిస్తుందని.. ఖచ్చితంగా విస్తరణలో అయినా తనకు మంత్రి పదవి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ ఆయన్ను ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా తన నియోజకవర్గంలో పనులు కావడం లేదని ఆయనపై ఎన్నోసార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

ప్రభుత్వ కార్యాలయాల ముందు కూడా ధర్నాలు చేశారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలకు ముందు ఆయన కచ్చితంగా వైసీపీలో ఉండ‌ర‌ని… బ‌య‌ట‌కు వ‌చ్చేస్తారంటూ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇక దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు. గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలోకి వచ్చి అనూహ్యంగా ఎమ్మెల్యేగా గెలిచారు. దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ మద్దిశెట్టికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

అసలు గత ఎన్నికల్లో బూచేపల్లి పోటీ చేయనని చెబితేనే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానని.. అయితే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక బూచేపల్లి పెత్తనం చేస్తూ తనకు వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారని మద్దిశెట్టి ఫైర్ అవుతున్నారు. ఇక పార్టీ అధిష్టానం కూడా బూచేపల్లి వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి దీనితో మద్దిశెట్టి ప్రస్తుతానికి పార్టీ మారను అని చెబుతున్నా… ఎన్నికలకు ముందు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకునేందుకు రెడీగా ఉన్నారు.

 

అలాగే ఆయన జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. పైగా దర్శి మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసిపి ఓడిపోవడంతో… పార్టీ అధిష్టానం దగ్గర కూడా ఆయనకు పెద్దగా మార్పులు లేవన్న ప్రచారం నడుస్తోంది. ఈ అంశాలే ఆయన పక్క చూపులు చూసేందుకు కారణం అవుతున్నాయి. ఏదేమైనా మరికొద్ది నెలల్లో ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనూ పెను సంచలనాలు ఖాయంగా కనిపిస్తున్నాయి.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, polititions, social media, telugu news, ysrcp