ఎమ్మెల్సీగా అనూరాధ గెలుపున‌కు మంగ‌ళ‌గిరిలో లోకేష్ బంప‌ర్ విక్ట‌రీకి లింక్ ఉందా ?

ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడిపి నుంచి పోటీ చేసిన విజయవాడ మాజీ మేయర్ పంచ‌మర్తి అనురాధ సంచలనాత్మక రీతిలో బంపర్ విక్టరీ కొట్టారు. ఆ విజయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడిపి శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపింది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీగా అనురాధ గెలుపునకు 2024 ఎన్నికలలో మంగళగిరిలో లోకేష్ గెలుపునకు పెద్ద లింక్ ఉంది. అదేంటి విజయవాడకు చెందిన అనురాధ ఎమ్మెల్సీగా గెలిస్తే అది మంగళగిరిలో లోకేష్ గెలుపులో ఎలా ? కీలక పాత్ర పోషిస్తుందన్న సందేహాలు చాలామందికి ఉంటాయి.

అయితే ఇది నిజం.. మంగళగిరి నియోజకవర్గంలో అనురాధ సామాజిక వర్గం అయిన‌ పద్మశాలి ఓటర్లు చాలా ఎక్కువ. మంగళగిరి పట్టణంలో పూర్తిగా పద్మశాలి సామాజిక వర్గానిదే డామినేషన్. అయితే 2014 ఎన్నికలలోను చంద్రబాబు ఆ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికలలో చిరంజీవి కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా ఆ సామాజిక వర్గాన్ని నిరుత్సాహ పరచకూడదని చిరంజీవికి మంగళగిరి మున్సిపల్ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు.

గత సాధారణ ఎన్నికలలో అనురాధకు మంగళగిరి ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్న ప్రచారం జరిగింది. అయితే చివరలో లోకేష్ స్వయంగా అక్కడి నుంచి పోటీ చేయడంతో అనురాధకు టీడిపి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. లోకేష్ గ‌త ఎన్నికలలో ఐదువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే టీడిపి నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేసిన గల్లా జయదేవ్ కు మాత్రం మంగళగిరి నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ దక్కింది.

గత రెండు ఎన్నికలలోను మంగళగిరిలో వైసిపి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డికే సీటు ఇస్తూ వస్తోంది. వచ్చే ఎన్నికలలోను ఆయనే అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆయ‌ను కాదని గంజి చిరంజీవి లాంటి వాళ్లకు జగన్ సీటు ఇచ్చినా లోకేష్‌పై ఎవరు గెలిచే పరిస్థితి లేదు. మంగళగిరిలో ఈసారి లోకేష్ కు గెలుపు కేక్ వాక్ అని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇక చేనేత సామాజిక‌ వర్గానికి చెందిన ఆడపడుచు అనురాధకు ఇప్పుడు టీడిపి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో పాటు.. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలలో ఆమెను గెలిపించుకోవడంతో మంగళగిరి పద్మశాలి సామాజిక వర్గంలో మరింత ఉత్సాహం వచ్చినట్లు అయింది.

గత ఎన్నికలలోనే తాము లోకేష్ ను ఓడించి తప్పు చేశామని.. ఈసారి తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని.. ఆ సామాజిక వర్గంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. లోకేష్ ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎప్పుడు తమను వదిలిపెట్టలేదని.. ప్రతిపక్షంలో ఉండి కూడా నియోజకవర్గ ప్రజలకు కావలసిన పనులు చేస్తున్నారని.. ఈసారి లోకేష్ గెలిస్తే తమ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంద‌న్న ధీమా స్థానికంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అనురాధ గెలుపుతో ఆ సామాజిక వర్గంలో కూడా పూర్తిగా మార్పు కనిపిస్తోంది. ఇది లోకేష్ కు భారీ మెజార్టీ రావడంలో ఎంతైనా కీలకం కానుంది.

Tags: ap politics, intresting news, latest news, latest viral news, nara lokesh, panchamurthi anuradha, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp