2019లో బాబు ఓడితే ఎన్టీఆర్‌కు పూజ‌లు… ఇప్పుడు జ‌గ‌న్ న‌మ్మ‌క‌ద్రోహంపై నిర‌స‌న దీక్ష‌…!

టిడిపి అధినేత చంద్రబాబు 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోవడంతో ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించి నివాళులు అర్పించి ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది అన్న ఓ సీనియర్ పొలిటికల్ నేత ఇప్పుడు చంద్రబాబు అరెస్టు తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాదు జగన్ దుర్మార్గం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆ నేత ఎవరో కాదు తెలంగాణకు చెందిన మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు.

చంద్రబాబు అరెస్టును రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఖండించాలని.. చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్కు ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే పూర్తి బాధ్యత అని.. జగన్ ను నమ్మి ఏపీ ప్రజలు పూర్తిగా మోసపోయారని విమర్శించారు. దళితులపై గతంలో ఎప్పుడు ఇన్ని ఘోరాలు జరగలేదు.. ఏపీ సీఎం జగన్ దళిత ద్రోహి.. జగన్ వైఖరిని ప్రజాస్వామ్య‌ వాదలంతా ఖండించాలన్నారు.

చంద్రబాబు లాంటి నేతలను తీసుకువెళ్లి జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతున్నారు.. వైయస్ కూడా ఇలా ఎప్పుడూ పరిపాలన చేయలేదని మోత్కుపల్లి విమర్శలు చేశారు. ఓ దళిత డ్రైవర్‌ను చంపి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అప్పగించారు. పులివెందులలో దళిత మహిళను అత్యాచారం చేసి చంపారు. ఇలా జగన్ పాలనలో దళితులపై తీవ్రమైన అఘాయిత్యాలు, ఆకృత్యాలు చోటుచేసుకుంటున్నాయని మోత్కుపల్లి మండిపడ్డారు.

అంతేకాకుండా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తాను ఆదివారం ఎన్టీఆర్ ఘాట్లో నిరసన దీక్ష చేపడతానని కూడా ఆయన ప్రకటన చేశారు. ఆదివారం ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాను నిరసన దీక్ష చేస్తానని మోత్కుపల్లి ప్రకటించారు.